కథలాపూర్, అక్టోబర్ 24: ‘రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చారు. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు మళ్లీ ఆగం చేసేందుకు వస్తున్నరు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటే చాలని ఆ పార్టీ అధ్యక్షుడు అంటున్నరు. నేనొక్కటే చెబుతున్నా.. వాళ్లను నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుంది. మళ్లీ పాతరోజులే వస్తయి. చేనుకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట లైట్లు పట్టుకొని బాయికాడికి పోయే రోజులు, యూరియా, ఎరువుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు వస్తయి. మళ్లీ ఆ బాధలు మనకు అవసరమా..? ఆలోచించండి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం కథలాపూర్ మండలకేంద్రంలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు మద్దతుగా మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ప్రచారం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఎట్లా సరిపోతదో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో వ్యవసాయానికి సరిపడా కరెంటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఐదు గంటల కరెంట్ ఇస్తున్నదని, దీంతో అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మాటలు నమ్మితే పాతరోజులే వస్తాయని, రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోతుందని, వ్యవసాయ రంగం వెనక్కి వెళ్లిపోతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని తెల్లరేషన్‌కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’ చాలా గొప్పదని, ఈ పథకం పేదలకు ఒక భరోసానిస్తుందని వివరించారు. ఇలా పేదలకు మేలు చేసేలా సరికొత్త పథకాలతో సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేశారని చెప్పారు. పెన్షన్ల విషయంలో మనం చాలా క్లారిటీగా ఉన్నామని మోసపూరిత మాటలు నమ్మవద్దన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రశాంతంగా ఉందని, తెలంగాణను ఆగం పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారని మండిపడ్డారు. ‘నేనొక్కటే అడుగుతున్నా.. వ్యవసాయానికి 24 గంటల కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటలు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో.. రైతులు తేల్చుకోవాలి’ అని సూచించారు. కాగా, అంతకుముందు కథలాపూర్ మండలకేంద్రంలో కేవలం వృద్ధులే ఒక బృందంగా ఏర్పడి ఇంటింటా ప్రచారం చేస్తున్న తీరును చూసి వినోద్‌కుమార్ సంతోషపడ్డారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, బీఆర్ఎస్ నాయకులు వర్ధినేని నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.