cyber crimes | గంగాధర,అక్టోబర్ 1 : సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరిగే విధానాన్ని గ్రామస్తులకు వివరించారు.
వ్యాపారం, పెట్టుబడి, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, గుర్తింపు, అనధికార క్రెడిట్ కార్డ్ వినియోగం, రుణ మోసాలు, నకిలీ రుణ యాప్లు, ఆర్థిక ఉచ్చుల ప్రకటన, ఆన్లైన్లో డెలివరీ చేయని వస్తువులు,సేవలు, ఆన్లైన్ భద్రతా చిట్కాలు, డిజిటల్ ప్రపంచంలో స్వీయ రక్షణ వంటి విషయాలను గురించి ఎస్సై అవగాహన కల్పించారు.
లోన్ ఫ్రాడ్ మోసాలు జరిగే విధానంపై అవగాహన
ఇంటర్నెట్లో మోసగాళ్లు రుణ గ్రహీతలను లక్ష్యంగా చేసుకుని, తాము బ్యాంకులు, చట్టబద్ధమైన డిజిటల్ లెండింగ్ సంస్థల ప్రతినిధులమని చెప్పి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, వేతన గిరాకీ పత్రాలు పొందేందుకు ప్రయత్నిస్తారని . ఈ లోన్ ఫ్రాడ్ స్కీమ్స్, ఫైనాన్స్ యాప్స్ ద్వారా వ్యక్తులపై మోసపూరిత పద్ధతులు అమలు చేస్తారు. మోసగాళ్లు ఫోన్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా తాము బ్యాంక్, రుణ సంస్థల ప్రతినిధులమని ప్రజలను మోసం చేస్తారని, ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, సులభమైన రుణ ఆమోదం పేరుతో వ్యక్తులను రుణాలకు ప్రలోభపెడతారని, వ్యక్తిగత సమాచారం, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, OTP వంటి వివరాలు అడగడంతోపాటు ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, రుణం ఇవ్వకుండా మోసం చేస్తారని వివరించారు.
రుణాల తీసుకునేటప్పుడు బ్యాంకులు, ఆమోదం అధికారిక వెబ్సైట్స్, యాప్స్ మాత్రమే ఉపయోగించాలని, బ్యాంక్, లెండింగ్ సంస్థలకు ఓటీపీ, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని సూచించారు. రుణం మంజూరు కాకుండానే, డబ్బులు అడిగితే మోసం జరుగుతుందని గ్రహించాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు బాధితులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్ క్రైమ్.జీవోవి.ఇన్ లో గాని, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.