Ramancha | చిగురుమామిడి, జనవరి 23: చిగురుమామిడి మండలంలోని రామంచ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రాత్ సుల్తానా, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ కవిత హాజరై మాట్లాడారు. బాలికల పట్ల వివక్షత చూపరాదని, లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకొని అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తే 1098 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిర్మూలన చట్టం గురించి వివరించారు.
గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మహిళలు ఆపద సమయంలో ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, వృద్ధుల హెల్ప్ లైన్ 14567, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్లను అవసరమైనప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుష్ప, మాధవీలత, ఏఎన్ఎం స్వాతి, ఆశాలు మంజుల, రాజేశ్వరి, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.