Accident | తిమ్మాపూర్, ఏప్రిల్24: ప్రయాణికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి నుండి ప్యాసింజర్ ఆటో కరీంనగర్ కు వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో రైస్ మిల్లులో వడ్లు అన్ లోడ్ చేసి రాజీవ్ రహదారిపైకి లారీ ఒక్కసారిగా రావడంతో ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ కాసర్ల తిరుపతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న ఆరుగురి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
హెచ్కేఆర్ టోల్గేట్ సిబ్బందికి ఏసీపీ వార్నింగ్
రేణికుంట వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందికి కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు. రేణిగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలానికి ఏసీపీ వచ్చి పరిశీలించారు. అక్కడే ఉన్న టోల్ ప్లాజా సిబ్బందితో ఆయన మాట్లాడారు.
ప్రమాదాలు జరిగే స్థలాలను ఇప్పటికే గుర్తించి హెచ్కేఆర్ కి సూచనలు చేసినా స్పందించకపోవడంపై ఆయన సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాలు జరిగితే హెచ్ఆర్కె వారినే బాధ్యులను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో డివైడర్ల వద్ద లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ నుండి హెచ్కెఆర్ యాజమాన్యానికి లెటర్ రాయడం జరిగిందని ఇప్పటివరకు స్పందించలేదని ఆయన అన్నారు.