సిరిసిల్ల ఉలిక్కిపడింది. కాంగ్రెస్ నాయకుల రాడీయిజంతో వణికిపోయింది. ప్రజాపాలన అంటూ కొద్దిరోజులుగా దౌర్జన్యం చేస్తున్న హస్తంముఠా, సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు గుండాల్లా రెచ్చిపోగా, బీఆర్ఎస్
కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. గులాబీ శ్రేణులను చావబాదారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, పార్టీ పట్టణాధ్యక్షుడు చక్రపాణి చేయి విరగ్గొట్టారు. ఖాకీల దాష్టీకంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల టౌన్, మే 26: సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సోమవారం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి సిద్ధమయ్యారు. వారిని వారించేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేత ఇన్నోవా కారుపై దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై వీరంగం సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అధికార పార్టీ కార్యకర్తలను వదిలి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారంటూ పార్టీ నేతలు వాపోయారు.
లాఠీలతో చితక్కొట్టి, బూట్లతో తన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారంటూ ఆరోపించారు. గాయపడ్డారన్న కనికరం చూపకుండా ఠాణాకు తీసుకెళ్లి నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీచార్జిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి చేయి విరిగిపోగా, బొల్లి రామ్మోహన్, సబ్బని హరీశ్, గడ్డం భాస్కర్, బింగి ఇజ్జగిరి, చంటి, కోడూరి భాస్కర్‌గౌడ్, తదితర నాయకులు దాదాపు 15మంది వరకు గాయాలపాలయ్యారు. గాయపడిన నాయకులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తెలుసుకుని జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిరిసిల్లకు తరలివచ్చారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కాంగ్రెస్ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకున్నారు. సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ క్యాంపు ఆఫీస్ ఎమ్మెల్యే కార్యాలయం కాదు. అది కేవలం ఎమ్మెల్యే కోసం నిర్మించుకున్న గృహం. శాసనసభ్యులు నిర్మించుకున్న ఇంటిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో ఎలా పెడతారో చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్య.
– బీ వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పొలిటికల్ డైవర్షన్‌తో ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నది. రేవంత్‌రెడ్డి పాలన రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నది. కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నరు. ఒక అడుగుముందుకేసి దాడులకు పాల్పడుతున్నరు. కేటీఆర్ క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను నేనొక్కటే ప్రశ్నిస్తున్నా. మీ పార్టీ నేత రాహుల్‌గాంధీ క్యాంపు ఆఫీస్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ ఆఫీసుల్లో ప్రధాని మోదీ ఫొటో ఉందా..? చెప్పాలి. దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం చూపి చితకబాదడం సరికాదు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నది. గతంలో 20 ఏండ్లు వెనుకబడిన సిరిసిల్లను కేవలం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్. ఆయన చొరవతో టెక్స్టైల్ పార్కులో వేల మందికి ఉపాధినిచ్చేలా ఏర్పాటైన పరిశ్రమ ప్రారంభోత్సవంలోనూ కేటీఆర్ ఫొటో పెట్టలేదు. గతంలో ఐదు సార్లు ఓడిన కేకే మహేందర్‌రెడ్డి, పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండు. సిరిసిల్ల ప్రజలు అతనికి ఓట్లు వేయలేదన్న అక్కసుతో సిరిసిల్లను కుక్కలు చింపిన విస్తరి చేయాలని చూస్తున్నడు.
ఈ ప్రాంతానికి చెందిన కొంత మందిని అడ్డుపెట్టుకుని రౌడీ రాజ్యం చేస్తున్నడు. ప్రొటోకాల్ పాటించాలని మేము ఎస్పీకి కలిసి వినతిపత్రం ఇచ్చి శాంతియుతంగా ఉంటే, కేకే మహేందర్‌రెడ్డి తొత్తులు కొంతమంది రేవంత్‌రెడ్డి ఫొటో క్యాంపు కార్యాలయంలో పెడతామని రెచ్చగొడుతూ మీడియా ముఖంగా చెప్పారు. ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు కావాలనే కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయానికి వచ్చేలా చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మమ్మల్ని అక్కడి నుంచి పంపించి వేసి కాంగ్రెస్ నేతలను మంగళహారతులు ఇచ్చి ఆహ్వానించిన చందంగా వ్యవహరించారు. క్యాంపు కార్యాలయం వద్దకు కాంగ్రెస్ నేతలు రావడాన్ని గమనించి నేను అక్కడికి వెళ్లా. నా వాహనం అద్దాలను వారు ధ్వంసం చేస్తే, వారిని వదిలి మా పార్టీ నాయకులపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై సీఎస్‌తో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా.
– జిందం చక్రపాణి, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు
కార్పొరేషన్, మే 26: ‘సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం దారుణం. తప్పు చేసినోళ్లను వదిలి అడ్డుకున్నోళ్లను కొడుతరా..? ఇదేం పద్ధతి?’ అని పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్యాంపు కార్యాలయంపై దాడి చేయాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు.
పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని గతంలోనూ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జీ షీట్లో రేవంత్‌రెడ్డి పేరు చేర్చడం, నిర్వాహకుల తీరుతో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పోటీ నుంచి తప్పుకోవడం లాంటి ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఉద్దేశపూర్వక దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలపై దాడులు చేయలేదని చెప్పారు.
ఈ సంస్కృతి సరికాదని, ఇప్పటికైనా తీరుమార్చుకోవాలని సూచించారు. శిశుపాలుడు అహంకారంతో విర్రవీగుతూ తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయినట్టుగా.. రేవంత్‌రెడ్డి సైతం అధికారం రాగానే తనకు ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చేసే ప్రతి తప్పునూ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తమ వక్రబుద్ధి మానుకొని ప్రజలకు సేవ చేయడం మీద దృష్టి పెడితే బాగుంటుందని హితవుపలికారు.