హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): కళారంగానికి తమ జీవితాలను అంకితం చేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కళాకారులను ఆదుకోవాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, క్రీడారంగం మాదిరిగానే సాంసృతిక రంగానికి ప్రత్యేక కోటా కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బుధవారం హిమాయత్‌నగర్‌లోని మగ్డూంభవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే కళలకు కాణాచి అని, పోరాటాలకు పురిటిగడ్డ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారులు తమ సాంస్కృతిక కళలతో ప్రజల్లో చైతన్యాన్ని నిం పారని గుర్తుచేశారు. మీడియా ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా, క్రీడారంగాలను ప్రోత్సహిస్తున్నట్టుగానే ప్రజా కళాకారులను కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో తెలంగాణ సాంసృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్, సినీ నటుడు మాదాల రవి, కవి యాకూబ్, కాంగ్రెస్ సాంసృతిక సేవా విభాగం అధ్యక్షుడు, సాంసృతిక సలహామండలి సభ్యుడు చక్రాల రఘు, దివాకర్, అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బీ స్టాలిన్ పాల్గొన్నారు.