హైదరాబాద్ ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అర్హులైన డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 252ను రద్దుచేసి గతంలో మాదిరిగానే జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే (143), కేబుల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.. డెస్క్ జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ తెలంగాణ మీడియా అకాడమీ దాకా ర్యాలీ తీశారు. అకాడమీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మీడియా అకాడమీ సెక్రటరీకి వినతి పత్రం అందించి తమ డిమాండ్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు బాదిని ఉపేందర్ మాట్లాడుతూ సవరణ జీవో 252 ప్రకారం అక్రెడిటేషన్లు జారీ చేస్తే డెస్క్ జర్నలిస్టులు అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రెడిటేషన్లు తగ్గించడం అంటే జర్నలిస్టులకు సంక్షేమాన్ని దూరం చేయడమే అవుతుందని వాపోయారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలో చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎడిషన్ సెంటర్లో నాలుగైదు జిల్లాల డెస్కులు ఉన్నాయని, ఎడిషన్ సెంటర్ల పరిధిలో జిల్లాకు నాలుగు చొప్పున అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ అక్రెడిటేషన్లకు పత్రికల సర్క్యులేషన్‌కు ముడిపెట్టడం సరికాదని చెప్పారు. పత్రికల సర్క్యులేషన్ ఎంత ఉన్నా పని చేసే జర్నలిస్టుల సంఖ్య తగ్గదని, కాబట్టి ఆ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
టీయూడబ్ల్యూజే (143) ట్రెజరర్ యోగానంద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. టీజేఎస్ ప్రధాన కార్యదర్శి రాజారాం మాట్లాడుతూ జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కార్టూనిస్టులకు, డిజిటల్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. నిరసన ర్యాలీలో డెస్క్ జర్నలిస్టులు ఎస్ వెంకటేశ్, టీ శ్రీనివాస్, రవి, సత్య ప్రసాద్, రమేశ్ కనపర్తి, చల్లా సైదిరెడ్డి, వెంకటేశ్, ఆర్ రమేశ్, వెంకటరమణ, పద్మ, కృష్ణారావు, జనార్దన్, సదానందం, రాజు, యాదగిరి రెడ్డి, రవీందర్, నరేశ్, రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్ రావు, ఉదయ్ కుమార్, విజయ్, కేబుల్, డిజిటల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.