హైదరాబాద్, ఫిబ్రవరి 25 : అక్రెడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగనివ్వబోమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సీపీఆర్వో మల్సూర్ స్పష్టంచేశారు. బుధవారం సచివాలయంలో డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) రాష్ట్ర నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్రెడిటేషన్ల జారీలో గందరగోళాన్ని, జిల్లాల వారీగా పనిచేస్తున్న సబ్ ఎడిటర్ల సంఖ్య, గతంలో వారికి ఇచ్చిన కార్డుల వివరాల సమాచారాన్ని సీపీఆర్వోకు వివరించారు. స్పందించిన మల్సూర్.. కార్డుల సంఖ్యను తగ్గించవద్దని మంత్రి పొంగులేటి స్పష్టమైన ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎన్ని ఇచ్చారన్న జాబితాను తెప్పించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మస్తాన్, శేఖర్, కిరణ్‌కుమార్, వినోద్‌రావు, భాస్కర్ ఉన్నారు.
అక్రెడిటేషన్ల జీవోలో మార్పులు చేయాలి ; మంత్రి పొంగులేటికి ఇండిపెండెంట్,డిజిటల్ మీడియా సంఘాల విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అక్రెడిటేషన్ల జీవోలో మార్పులు చేయాలని కోరుతూ ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా సంఘాల ప్రతినిధులు సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సరైన గుర్తింపు కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. జర్నలిస్టుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని ఐఅండ్‌పీఆర్ ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు స్వామి ముద్దం, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ మెంబర్ అశోక్, శ్రీనివాస్, శ్రీనివాసరావు, ప్రభాకర్, సిద్దగోని సుదర్శన్, మేకల కృష్ణ, ఎక్కలూరి నాగర్జున్‌రెడ్డి పాల్గొన్నారు.