Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా 636 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్స్ 80(2), 85, 108, 3(5)తోపాటు వరకట్న నిరోధక చట్టాలైన సెక్షన్స్ 3, 4 కింద దాఖలైన ఈ కేసులో చార్జిషీటును భోపాల్ జిల్లా కోర్టులో సమర్పించారు. ఈ కేసులో చార్జిషీటు ఇదివరకే సమర్పించాల్సి ఉంది. అయితే, మరికొంత గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో కోర్టు మరో ఆరురోజుల సమయం ఇచ్చింది.
ఈ లెక్కన నేడు తుది గడువు కావడంతో.. ఆగష్టు 17, సోమవారం ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ. మోడల్, నటి అయిన త్విషా శర్మ భోపాల్‌లోని తన అత్తవారింట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె భర్త సమర్ధ్ సింగ్ లాయర్. అత్త రిటైర్డ్ జడ్జి. మే 12న ఆమె మరణించింది. ఆత్మహత్య చేసుకుని ఆమె మరణించింది. అయితే, కొన ఊపిరితో ఉన్న త్విషా శర్మను భర్త, అత్త.. భోపాల్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణంపై అనుమానాలు ఉండటంతో వైద్యులు దీన్ని మెడికో-లీగల్ కేసుగా పరిగణించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈ విషయంపై స్పందించిన త్విషా శర్మ తల్లిదండ్రులు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
భర్త, అత్త వేధింపుల వల్లే ఆమె మరణించిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇదే సమయంలో ఆమె మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించారు. రెండో పోస్టుమార్టం నివేదికలో త్విషా శర్మ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తేలింది. అత్త, భర్త వరకట్న వేధింపులు, మానసిక వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, వారిని కఠినంగా శిక్షించాలని త్విష తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దాదాపు ఐదు నెలలుగా ఈ కేసుపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు తాజాగా చార్జిషీటు దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితులైన అత్త గిరిబాలా సింగ్‌ను పోలీసులు ఈ ఘటన జరిగిన రెండు వారాలకు అరెస్టు చేశారు. భర్త సమర్ద్ సింగ్ కూడా కొద్ది రోజులు పరారీలో ఉండి, తర్వాత కోర్టులో లొంగిపోయాడు. ఆ లోపు ఇద్దరూ బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ, కోర్టులు బెయిల్ నిరాకరించడంతో ఇద్దరినీ అధికారులు అరెస్టు చేశారు.