ఖైరతాబాద్, ఫిబ్రవరి 25: అరుదైన వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారికి సోమాజిగూడలోని యశోద దవాఖాన వైద్యులు అత్యాధునిక చికిత్సతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అందుకు సంబంధించిన వివరాలను దవాఖాన సీనియర్ హెమటో ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ అశోక్ కుమార్ పిైళ్లె, యూనిట్ హెడ్ ప్రశాంత్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లా నందవరానికి చెందిన ముళ్ల ఖాజా, రేష్మా దంపతుల కుమారుడు ఖాదర్ అర్మాన్ నిరంతరం తక్కువ ప్లేట్‌లెట్స్‌తో బాధపడుతున్నాడు. ఆ చిన్నారి తీసుకునే ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్తుండటంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
దీంతో అర్మాన్ తల్లిదండ్రులు నిరుడు డిసెంబర్ 26న యశోద వైద్యులను సంప్రదించడంతో ఆ చిన్నారికి పరీక్షలు చేయగా అరుదైన, పది లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ‘అమెగాకార్యోసైటిక్ థ్రాంబోసైటోపేనియా’తో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో తల్లిదండుల అనుమతితో అర్మాన్‌కు అత్యాధునిక ఆలోజెనిక్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడి (హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ టాన్స్‌ప్లాంటేషన్) చికిత్స ప్రారంభించారు. కానీ, దాత అందుబాటులో లేకపోవడంతో గత నెల 8న తండ్రి మూలకణాలతో చికిత్స చేశారు. అనంతరం ఆ చిన్నారి స్థిరంగా కోలుకోవడంతో వెంటిలేటర్ సపోర్టును తొలగించారు. ప్రస్తుతం అర్మాన్ కోలుకోవడంతో దవాఖాన నుంచి డిశ్చార్జి చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు.