Begumpet | రామగిరి, జనవరి 9 : రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు చైన్ చోరీకి దుండగులు యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుంట మల్లమ్మ (75) ఇంటి సమీపంలో ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు.
అయితే వృద్ధురాలు ధైర్యంగా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో దుండగులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత వృద్ధురాలిని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ గౌడ్ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని బాధితురాలికి భరోసా కల్పించారు. గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ పెంచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.