Nustulapur | తిమ్మాపూర్, జూలై 2 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం వద్ద దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ లోనీ కిసాన్ నగర్ కు చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం పని కోసం అడ్డా వద్ద ఉండగా తనకు పని ఇస్తానని ఓ వ్యక్తి నమ్మించాడు. దీంతో ఆ మహిళ దుండగుడి వెంట వెళ్లింది. వెంట తీసుకెళ్లిన వ్యక్తి నుస్తులాపూర్ శివారులోకి తీసుకెళ్లి ఆమెపై ఉన్న బంగారం దోచుకుని, పక్కన ఉన్న బావిలోకి తోసేసాడు. అక్కడి నుండి వెళ్లిపోయాడు.
24గంటలకుపైగా బావిలోనే..
బావిలోకి తోసేసిన వెంటనే నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోగా ఆ మహిళ అదృష్టవశాత్తు బావిలో చిన్న ఆధారం దొరకడంతో పట్టుకొని అలాగే ఉంది. గురువారం ఉదయం బాయి వద్దకు వెళ్లిన బావి యజమాని అరుపులు వినిపిస్తుండడంతో గమనించి స్థానికులకు సమాచారమందించాడు. దీంతో గ్రామస్తులు హుటాహుటిన చేరుకొని పోలీసులకు సమాచారం అందించి తాళ్లు, మంచం వేసి ఆమెను బయటకు తీశారు. 24 గంటలకు పైగా బావిలో ఉండడంతో ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.