Godavarikhani | కోల్ సిటీ, జనవరి 28 : ‘రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడ్డ బాకీని మిత్తితో సహా తీర్చమని అడగండి.. అప్పుడే నమ్మి ఓటు వేస్తామని చెప్పండి.. లేదంటే మళ్లీ మోసపోక తప్పదు… ఇప్పుడు కూడా అబద్ధపు హామీలకు ఆశపడి ఓటు వేస్తే మరో మూడేళ్లు గోస తప్పదు..’ అని 41వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి నీరటి శ్రీనివాస్ మహిళలకు సూచించారు. డివిజన్లో బుధవారం సాయంత్రం ఇంటింటికి వెళ్లి బాకీ కార్డులు పంచి పెడుతూ మహిళలకు వివరించారు.
ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచే తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500లు చెల్లిస్తామని చెప్పారని, ఈ లెక్కన 25 నెలలుగా ఒక్కో మహిళకు రూ.62,500 బాకీ పడ్డారని, అలాగే వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.4వేల పెన్షన్ చొప్పున 25 నెలలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారని, ఈ లెక్కన 25 నెలలకు ఒక్కొక్కరికి రూ. 50వేలు. కాలేజీ విద్యార్థులకు పీజు రీయింబర్స్ మెంట్ రూ.8వేల కోట్లు బాకీ పడ్డారని వివరించారు.
మన బంధువులకు బాకీ ఉంటే వడ్డీతో సహా వసూలు చేసినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీకు ఇచ్చిన హామీలు బాకీల కిందనే జమ కట్టి వడ్డీతో సహా చెల్లించినప్పుడే ఆలోచిస్తామని, ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రశ్నించాలని సూచించారు. ఇప్పుడు కూడా మళ్లీ అబద్ధపు హామీలను నమ్మి ఓటు వేస్తే మరో మూడేళ్ల దాకా ఏ ఒక్కటి కూడా నెరవేర్చబోరనీ, మళ్లీ మోసపోకుండా ఉండాలంటే మీ బాకీ డబ్బులు ఇవ్వమని అడగండని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.