తిమ్మాపూర్,మార్చి25: గ్రామాల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆశ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తిమ్మాపూర్ మండల కేంద్రంలో రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్న తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టులు చేసి తమను నిర్బంధించారని, కనీసం తమ సమస్యలు వినేందుకు కూడా సమయం ఇవ్వలేరా అని ప్రశ్నించారు. ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు రజిత మాట్లాడుతూ గ్రామాల్లో తాము చేస్తున్న సేవలను ఒకసారి సర్వే చేసి తెలుసుకోవాలని, అప్పుడే తాము అడిగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.
గత కొద్దిరోజులుగా వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి, ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఫిక్స్డ్ వేతనంతో పాటు తాము చేసిన ఎన్నో సర్వేల డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సేవలు ఎలా ఉన్నాయో ప్రభుత్వానికి తెలుసని, అయినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రానున్న రోజుల్లో ధర్నాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.