public debate | కమాన్ పూర్, మే 18: కమాన్ పూర్ మండలంలో రొంపికుంట గ్రామంలో ఎవరి పాలనలో ఎన్ని ఏండ్లలో ఎంత అభివృద్ధి చేశారో తెల్చుకోవడానికి తాము సంసిద్దంగా ఉన్నామని, దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు. మండలంలోని రొంపికుంట గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మంథని నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఎక్కువ కాలం ఎమ్మెల్యేలుగా పరిపాలించింది కాంగ్రెస్ నాయకులేనన్నారు.
రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో కొనసాగినప్పటికీ రొంపికుంట గ్రామ అభివృద్ధికి పెద్దగా చేసింది ఏమి లేదన్నారు. 40 ఏళ్ల పాటు దుద్దిల్ల శ్రీపాదరావు, ఆయన తనయుడు శ్రీధర్ బాబు లే ఎమ్మెల్యేలుగా కొనసాగారని అన్నారు. నాలుగేండ్లు మాత్రమే పుట్ట మధు ఎమ్మెల్యేగా కొనసాగారని, ఈ కాలంలోనే రొంపికుంట గ్రామ అభివృద్ధికి లక్షలాది రూపాయలు మంజూరు చేయించి గ్రామ అభివృద్ధికి దోహదపడ్డారన్నారు.
రొంపికుంట గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు, పాఠశాల గదుల నిర్మాణాలకు, సామాజిక భవన నిర్మాణాలకు ఇలా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఉన్న మాట అంటే ఉలుకేక్కువ అన్న సామేత చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిన రొంపికుంట గ్రామానికి నయాఫైసా అభివృద్ధి చేయలేదని అంటే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఉలికిపడి ఇష్టానుసారంగా, అర్ధరహితంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చినా హామీలు అమలవుతున్నాయా..? అని ప్రశ్నించారు. రొంపకుంట గ్రామంలో ఎందరికి రూ, 2 లక్షల రుణమాఫీ వర్తించిందో చెప్పగలరా.. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు ఇస్తామన్నా రూ.2500 ల మాటేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చినవన్నీ 420 హామీలేనని, వాటి అమలుపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పుట్ట మధు మంథని ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ గా కొనసాగిన కాలంలో ఎంతో మందికి ఆరోగ్య చికిత్స కోసం ఎల్వోసీలు, సీఎం రిలీఫ్ పండ్ ఇప్పించారని, కాంగ్రెస్ పాలనలో వాటి గురించే తెలియదని ఆరోపించారు.
పుట్ట మధు మంథని ఎమ్మెల్యేగా గెలిచాకా ఎందరికో ప్రభుత్వం నుండి వైద్య సహాయానికి ఆర్థిక భరోసా అందించారన్నారు. పుట్ట మధు హయాంలో గ్రామంలో అభివృద్ధియే జరగలేదని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శమన్నారు. తమ స్థాయిని మరిచి కాంగ్రెస్ నాయకులు మరోమారు పుట్ట మధు పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ రొంపికుంట గ్రామ శాఖ అధ్యక్షుడు కొయ్యడ రవి యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, నాయకులు పులిపాక రాయలింగు, కొయ్యడ కుమార్ యాదవ్, చొప్పరి తిరుపతి, కొండి అనిల్, ఊరడి శ్రీనివాస్, పులిపాక మల్లయ్య, జంగిలి శ్రీనివాస్, కొండి సంపత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.