ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలతో ఆగం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ఇవి తప్పనిసరి పాటించాలని, అలాగే తేమ శాతం, ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ధాన్యం ఉన్నదని ఏఈవోలు నిర్ధారించిన తర్వాతనే కొనుగోళ్లు చేస్తారని మెలిక పెట్టింది. అంతే కాకుండా, సన్నరకాలను కూడా నిర్ధారణ తర్వతే కొనాలని అధికారులను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలపై నమ్మకం కోల్పోయి, అగ్గువసగ్గువకే వడ్లను తెగనమ్ముకుంటున్నది.
కరీంనగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో సులభమైన పద్ధతులను అనుసరించింది. ఏ ఊరికి సంబంధించిన ధాన్యాన్ని ఆ ఊరిలోనే కొనేలా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలూ జరగకుండా చూసింది. చివరి రైతు వరకు కొనుగోళ్లు జరిపి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొనుగోళ్లను తగ్గించే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కేంద్రాల నిర్వాహకులే తేమ, తదితర నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోళ్లు జరిపేవారు. ఇప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతున్నది. ఒక్కో మండలంలో నలుగురైదుగురు మాత్రమే ఏఈవోలు ఉంటారు. ఎంత చిన్న మండలంలోనైనా కనీసం 7 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుంది. ఇలాంటి సమయంలో ప్రతి రైతు ధాన్యాన్ని ఏఈవోలు నిర్ధారించే పరిస్థితి ఉంటుందా..? అనే చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఆయా గ్రామాల్లోని కేంద్రాలకు రైతులు ధాన్యం తేగానే నిర్వాహకులు రైతు పేరు, కేంద్రానికి తెచ్చిన ధాన్యం వివరాలు నమోదు చేసుకుని ఏఈవోలకు సమాచారం అందిస్తారు. వారు తమకు వీలైనప్పుడు వచ్చి పరిశీలిస్తారు. ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారంగా 17 శాతం మాత్రమే తేమ, ఇతర ప్రమాణాలు ఉంటేనే ఏఈవోలు ధ్రువీకరిస్తారు. ఒక వేళ తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉంటే వారు ధ్రువీకరించే పరిస్థితి ఉండదు. రైతులు తమ వెంట ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాసు పుస్తకం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. కౌలు రైతుల పరిస్థితి మరోలా ఉంది. పట్టాదారుల మాదిరిగానే కౌలు రైతులు కూడా అన్ని రకాల పత్రాలు వెంట తీసుకెళ్లాలి. అయితే, ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు ఓటీపీ మాత్రం పట్టాదారుకు వెళ్తుంది. పట్టాదారు ఈ ఓటీపీ నంబర్ చెబితేనే ఆన్లైన్లో నమోదై కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే పరిస్థితి ఉంటుంది.
సన్నరకం ధాన్యాన్ని నిర్ధారించే బాధ్యతలను కూడా ప్రభుత్వం ఏఈవోలకు అప్పగించింది. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వీటిని ఎక్కువగా సాగు చేశారు. ఈ వివరాలను వ్యవసాయ అధికారులు ఇది వరకే నమోదు చేశారు. అయితే, సన్నవడ్లు ఏ రకమైనా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని ఇన్నాళ్లూ రైతులు ఆశలు పెంచుకున్నారు. కానీ, వీటికి కూడా ప్రభుత్వం నిబంధనల పేరిట ఆంక్షలు పెట్టింది. కేవలం 33 రకాల సన్న రకాలను మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. ఇతర రకాలు తేవద్దని కూడా తేల్చి చెప్పడంతో కొందరు రైతులు అయోమయంలో పడ్డారు. దొడ్డురకం, సన్నరకం ధాన్యానికి కేంద్రాల్లో వేర్వేరుగా కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నరకం కొద్ది రోజులు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చే అవకాశమున్నది. 33 రకాల్లో ఏ రకమో నిర్ధారించడం, అసలు అవి సన్నాలా..? కావా..? అనేది నిర్ధారించే బాధ్యతలను కూడా ప్రభుత్వం ఏఈవోలకు అప్పగించింది. 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదని, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన పెట్టింది. అందుకు అవసరమైన మైక్రో మీటర్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో రైతులకు తిప్పలు తప్పేలా లేవు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కారు కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1330 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, ఇప్పటి వరకు దాదాపు అన్నింటినీ ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, ఒక్క కేంద్రంలోనూ ఇప్పటి వరకు క్వింటాల్ ధాన్యం కొన్నది లేదు. ఒక పక్క అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రైతులు కోతలకు తొందరపడుతున్నారు. తీరా తేమ పేరిట ఇప్పటి వరకు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదు. ఫలితంగా విసిగిపోతున్న అనేక మంది రైతులు ఇటు దళారులు, అటు మిల్లర్లకు అమ్మేసుకుంటున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మాత్రం ఇక్కడ వర్తించడం లేదు. కల్లాల వద్దకు వచ్చి కొంటున్న ధాన్యానికి క్వింటాల్‌కు 1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. మిల్లుల వద్దకు వెళ్లి రైతులు విక్రయించుకుంటే ఒకో నూరు నూటాయాభై ఎక్కువ వస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రకటించిన ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు 2,320, సాధారణ రకం క్వింటాల్‌కు 2,300 ఎక్కడా, ఏ రైతుకూ లభించడం లేదు. ఇప్పటికైనా నిబంధనలు సడలించి స్వేచ్ఛగా విక్రయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.