హుజూరాబాద్టౌన్, మార్చి 22: మాతా, శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు రక్తహీనతతో బాధపడుతున్న కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలను గుర్తించి వారికి సమతుల ఆహారం అందించాలన్నారు. పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు, బరువు నమోదు చేసే అంశాలపై శిక్షణ ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, హుజూరాబాద్ సీడీపీవో భాగ్యలక్ష్మి, సర్పంచ్, ఎంపీటీసీలు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, ట్రైనర్స్ రమేశ్, సదానందం, భాసర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వీణవంక, మార్చి 22: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో అర్హత కలిగిన యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దళిత బంధు యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, మండలంలో ఇంకా యూనిట్లు తీసుకోని వారు అనుభవం ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బ్యాడ్జీలు కలిగి కార్లు ఎంపిక చేసుకున్న వారికి త్వరలో వాటిని అందజేస్తామని తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాజేశ్వర్రావు, ఘన్ముక్ల ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.