Former MLA Dasari Manohar Reddy | ఓదెల, నవంబర్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగులోని చెక్ డ్యామ్ కూలడంలో అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంపుల గ్రామంలోని కూలిన చెక్ డ్యామ్ ను ఆయన శనివారం సాయంత్రం సందర్శించి పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ఇసుక మాఫియా వారు పేల్చినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంత రైతులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను చూసి మానేరు వాగులో చెక్ డ్యాం లకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.
చెక్ డ్యామ్ వల్ల రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోయి భూగర్భ జలాలు పెరిగినట్లు చెప్పారు. మంచి ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యామును కూల్చడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి పేల్చినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కూలిన చెక్ డ్యాం ను వెంటనే పునర్నిర్మాణం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగొని శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచులు ఉప్పుల సంపత్ కుమార్, గోవిందుల ఎల్లస్వామి, నాయకులు సదా రెడ్డి, చర్లపల్లి సురేష్ గౌడ్, ఉప్పుల శ్రీనివాస్, పరుశరాములు, కుమార్, బుచ్చయ్య, లింగయ్య, శ్రీనివాస్, గణేష్, శివ తదితరులు ఉన్నారు.