ఇటీవల మాలోత్ అంబవ్వ అనే మహిళా రైతు తన ఇద్దరు కుమారులు రవి, నబ్యా పండించిన పంట నేల రాలడంతో బోరున విలపించింది. రాలిన పంట భూమికి పట్టా లేకపోవడంతో పరిహారం అందదని వెకివెక్కి విలపించింది. సోమవారం అంబవ్వ పోడు పట్టాలివ్వబోతున్నట్లు తెలిసి సర్పంచ్ సునీతకు స్వీట్లు తినిపించి సంబురంలో మనిగితేలింది.
సమైక్య పాలనలో అభివృద్ధికి దూరమై గోసెళ్లదీసిన గుంటపల్లి చెరువు తండా స్వరాష్ట్రంలో సరికొత్తరూపు సంతరించుకున్నది. నాలుగేండ్ల క్రితం పంచాయతీగా అవతరించిన తర్వాత ప్రగతి పథంలో సాగుతున్నది. మౌలిక వసతుల కల్పనతో రందీలేకుండా బతుకెళ్లదీస్తున్నది. తాజాగా సర్కారు పోడు భూములకు పట్టాందనుండడంతో తండా జనం సంబురంలో మునిగితేలుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు బతికినంతకాలం రుణపడి ఉంటామని చెబుతున్నది.
ఎల్లారెడ్డిపేట, జూలై 3: ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపల్లి చెరువుతండా నాడు అభివృద్ధికి దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉండేది. తండాలో 326 మంది జనాభా ఉండగా, అందు లో 163 మంది పురుషులు, 163 మంది స్త్రీలు ఉన్నారు. 44 నివాసాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పా టుకు ముందు అల్మాస్పూర్ పంచాయతీ పరిధిలో ఉండేది. నాలుగేండ్ల క్రితం సర్కారు ఈ తండాను పంచాయతీగా ఏర్పాటు చేసింది. పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పించింది. తాజాగా 44 మంది రైతులకు 80 ఎకరాల పోడు భూములకు పట్టాలచ్చేందుకు అంతా సిద్ధం చేసింది. ఇప్పటికే కొందరికి పట్టాలిచ్చి రైతుబంధు జమ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం గిరిజన సామూహిక భవనం వద్ద సంబురాలు జరుపుకున్నది. అటు పంచాయతీగా ఏర్పా టు చేసి, ఇటు పోడు భూములపై హక్కులు కల్పించి తలరాత మార్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నది.
శరవేగంగా అభివృద్ధి..
ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో గుంటపల్లి చెరువుతండా అభివృద్ధికి విరివిగా నిధులు వెచ్చిస్తున్నది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అ ల్మాస్పూర్-వీర్నపల్లి ప్రధాన రహదారి నుంచి గుంటపల్లి చెరువు తండా వరకు 1.49 కో ట్లతో బీటీ రోడ్డు, 20 లక్షలతో రెండు సీసీ రో డ్లు, 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. 56 కొత్త స్తంభాలను ఏర్పా టు చేసి లూజ్వైర్ల సమస్యను పరిష్కరించారు. ముఖ్య కూడలిలో లక్ష వెచ్చించి హైమాస్ట్ లై ట్ను ఏర్పాటు చేశారు. 25వేల లీటర్ల సా మర్థ్యం కల్గిన మిషన్ భగీరథ నూతన ట్యాంకును నిర్మిం చి ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నారు. 12.60 లక్షలతో శ్మశాన వాటిక నిర్మించా రు. చెత్త సేకరణ, చెట్లకు నీరుపట్టేందుకు 5.45 లక్షలతో ట్రాక్టర్, ట్యాలీని కొనుగోలు చేశారు. ఊరు శివారులో 2.50 లక్షలతో డంప్యార్డ్ ని ర్మించారు. 1.50 లక్షలతో నర్సరీ, లక్షతో పల్లె ప్రకృతి వనం, 1.60 లక్షలతో తెలంగాణ క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు
గ్రామంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఆసరా కింద 16 మందికి నెలకు 34,256 పంపిణీ చేస్తున్నారు. కల్యాణలక్ష్మి కింద నలుగురికి 4లక్షలు, కేసీఆర్ కిట్ కింద ఆరుగురికి 75 వేలు అందించారు. తొమ్మిదేండ్లలో మొత్తంగా 2.20కోట్లు ఖర్చు చేసింది. ఆసరా, రైతు బంధు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, రేషన్ కింద ఏటా 8.86లక్షలు అందిస్తున్నది.
పోడు రైతులకు మంత్రి భరోసా
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలనకు మంత్రి కేటీఆర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ భూములకు పట్టాలు లేక పోవడంతో పరిహారం రాదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో ఎండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలని గోడు వెళ్లబోసుకున్నారు. అమాత్యుడు సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. 44 మంది పోడు రైతులకు సుమారు 80 ఎకరాల భూములకు పట్టాలు రానుండడంతో ఆనందంలో మునిగితేలారు.
రైతుబంధు డబ్బుల్ జమైనయ్..
మా తండావాసులకు ఎవుసమే ఆధారం. నాకు తాతల ముత్తాతల కాలంనుంచి వచ్చిన రెండెకరాల పోడు భూమి ఉన్నది. దానికి పట్టాలేక గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం పొందలేం. తెలంగాణ రాకముందు పట్టాల కోసం ఆఫీసుల సుట్టూ తిరిగినం, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ గవర్నమెంట్ మాలాంటి పోడు రైతులను గుర్తించి పట్టాలిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. నాకు శనివారం రూ. 10 వేల రైతుబంధు డబ్బులు ఖాతాలో పడ్డయ్.
-భూక్యా సంతోష్, యువరైతు (ఎల్లారెడ్డిపేట)
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నం
మా తండల ఎక్కువ మంది పోడు భూమి దు న్నుకుని బతుకుతున్నరు. ఏండ్ల నుంచి దు న్నుకున్నా ఆ భూమికి ఇప్పటిదాక పట్టాలేదు. ఇప్పు డు సీఎం కేసీఆర్ సార్ ఈ పోడు భూములకు పట్టాలిస్తున్నరని తెలిసి తండావాసులందరూ సంతోషంగ ఉన్నరు. ఈ రోజు ఊరంత సీఎం సారుకు, కేటీఆర్ సార్కు సంతోషంగా పాలాభిషేకం చేసినం.
– మాలోత్ సునీత, సర్పంచ్