వర్ష బీభత్సంతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు ‘మేమున్నా’మంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అభయమిస్తున్నారు. వాన గెరువిచ్చినా జనంలోనే ఉంటూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉన్నదనే ధీమానిస్తున్నారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం అర్ధరాత్రి తర్వాతి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ధర్మపురి గోదావరి తీరం వెంట కాలనీల్లో ప్రజలను అప్రమత్తం చేసి, 155 మందిని పునరావాస కేంద్రానికి తరలింపజేశారు. శంకరపట్నం మండలంలో కల్వల ప్రాజెక్టు గండిని మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పరిశీలించారు.
– కరీంగనర్, జూలై 28 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : వరుస వర్షాలు ప్రారంభమైన రెండు మూడు రోజుల నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి వానలు దంచికొట్టగా, భారీ వర్షాలుంటాయనే ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు. నియోజకవర్గం అంతటా పర్యటించారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ముంపు, లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ.. ఆయాచోట్ల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్రవారం వాన గెరువెచ్చినా జనంలోనే ఉన్నారు. దాదాపు అందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి తిరిగారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వర్షాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్ని తానై వ్యవహరించారు. స్వయంగా ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేశారు. జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాల రూరల్ మండలంలో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గంభీరావుపేట మండలం ఎగువమానేరును పరిశీలించారు. ప్రాజెక్టు మత్తడి వద్ద గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టారు. ఆ తర్వాత రుద్రంగిలో వంతెన వద్ద కోతకు గురైన అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అండగా ఉంటామని వరద బాధితులకు భరోసానిచ్చారు. ఆందోళన చెందవద్దని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని చెప్పారు.
రామన్న దిశానిర్దేశం
వర్షాలు మొదలైనప్పటి నుంచే మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా అధికారులను అనుక్షణం అప్రమత్తం చేశారు. ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్‌గా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు బీఆఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు నిర్దేశం చేశారు. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సెస్ సిబ్బంది మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మొత్తంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకపోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అమాత్యుడు రామన్న అభినందించారు.
క్షేత్రస్థాయిలోనే కొప్పుల
వరుస వర్షాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలోనే మకాం వేశారు. భారీ వర్షాలు మొదలు కావడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆయన, వెంటనే జిల్లాకు చేరుకున్నారు. గురువారం ఉదయం ధర్మపురి వద్ద గోదావరిలో నీటి ప్రవాహ తీవత్రను పరిశీలించి, అక్కడే అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ధర్మపురి పట్టణంలోని వివిధ కాలనీలను పరిశీలించారు. తర్వాత గొల్లపల్లి మండలానికి చేరుకున్నారు. సదాజల వాగును ఆనుకొని ఉన్న బొంకూర్, వెనుగుమట్ల గ్రామాల్లో ఇండ్లలోకి వరద చేరడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రాత్రి జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ ఎగ్గడి భాస్కర్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాత్రి 10 గంటలకు ధర్మపురికి చేరుకున్నారు. అక్కడే మకాం వేసి రాత్రి ఒంటి గంట నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా ఎస్పీ, అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. గోదావరి ఒడ్డున సంతోషీమాత, గోదావరి మాత ఆలయాలు పూర్తిగా మునిగిపోవడం, లక్ష్మీనరసింహ సంస్కృతాంద్ర కళాశాల వరకు వరద రావడంతో నదికి దగ్గరగా నివాసాలున్న ప్రజలను అప్రమత్తం చేశారు. తీరం వెంట ఉన్న బ్రాహ్మణవాడ, కుమ్మరి వాడ, బోయవాడల్లో పర్యటించారు. ఆయాచోట్ల మొత్తం155 మందిని పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. శుక్రవారం ఉదయం సైతం మంత్రి గోదావరిని పరిశీలించారు. నదికి ప్రత్యేక పూజలు చేశారు.
గంగుల పర్యవేక్షణ
భారీ వర్షాలతో మంత్రి గంగుల కమలాకర్ జిల్లా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వరద ప్రభావంపై ఆరా తీశారు. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి వరద ఉధృతంగా రావడంతో గురువారం సాయంత్రం ఎల్ఎండీ గేట్లను ఓపెన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ ర్షాలు కురుస్తుండడంతో అన్ని జలాశయాలు, చెరువులు నిండాయని, రోడ్లపై వరద పొంగుతున్నదని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.