Singareni | గోదావరిఖని : సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. సింగరేణి లో కార్మికుల సమస్యల పరిష్కారం లో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించేందుకు ఏఐటీయూసీ ముందుంటుందన్నారు. సింగరేణి లో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం గా యాజమాన్యం తో జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్న వాటిని యాజమాన్యం అమలు చేయనందుకు నిరసిస్తూ 31 డిమాండ్ ల పై సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దీనిపై ఈ నెల 25న హైదరాబాద్ లో ఆర్ఎల్సీ వద్ద చర్చలు జరిగాయని, జూలై 10 లోపు పరిష్కారం చేసుకోవాలని ఏఎల్సీ యాజమాన్యానికి సూచించించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం సమ్మె నోటీసులోని డిమాండ్ ల పై పరిష్కారం చేయాలని, లేకుంటే అన్ని కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత సమ్మెకు పిలుపునిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, వీరభద్రం, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు సిద్దమల్ల రాజు, నాయిని శంకర్, గొడిశల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.