చొప్పదండి, మే 30: వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. మారెట్లో గుర్తింపు లేని విత్తనాలు పుట్టగొడుగుల్లా వస్తున్న తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే వాడాలని చెబుతున్నారు. నకిలీలను అరికట్టేందుకు విత్తన ప్యాకెట్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొందుపర్చిన వివరాలను సరిచూసుకొని కొనుగోలు చేయాలంటున్నారు.
ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాలని చెబుతున్నారు. విత్తన కొనుగోళ్లలో ఏవైనా అవకతవకలకు పాల్పడితే సదరు డీలర్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. విక్రయించే సమయంలో రసీదులపై డీలర్ సంతకం ఉండాలన్నారు. గడువు చెల్లిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కొనుగోలు చేయొద్దని తెలిపారు. రైతులు ఆలోచించి విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడి పొంది ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. విత్తనం నాటాక మొలకెత్తక, పూత సరిగ్గా రాక పంటలో లోపం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకినప్పుడు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించాలన్నారు. పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు వ్యవసాయాధికారుల సలహాలు సూచనలు పాటిస్తే అధిక మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
వానకాలం సమీపిస్తుండడంతో రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారి లైసెన్స్ రద్దుచేసి షాపులను సీజ్ చేస్తాం. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలి. విత్తన ప్యాకెట్లు, పురుగుమందు డబ్బాలపై తయారీ, గడువు తేదీ తప్పనిసరిగా ఉండాలి. కాలం చెల్లిన విత్తనాలు, మందులను అమ్మితే చర్యలు తీసుకుంటాం.
-వంశీకృష్ణ, ఏవో చొప్పదండి