Admissions | హుజురాబాద్ టౌన్, జూలై 6: హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ హాస్టళ్లలో ఉచిత విద్య, భోజన వసతితో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రీ-మెట్రిక్ హాస్టల్స్ (3వ తరగతి నుండి 10వ తరగతి వరకు)లో హుజురాబాద్లో బాలురు-71, బాలికలు- 78, జమ్మికుంటలో బాలురు-35, బాలికలు-82, వావిలాలలో బాలురు-33, వీణవంకలో బాలురు 70, రేకొండలో బాలురు 77, చిగురుమామిడిలో బాలురు-81, నుస్తులాపూర్ బాలురు 72, ఇందుర్తిలో బాలురు 78, తిమ్మాపూర్లో బాలికలు- 215, పోస్ట్-మెట్రిక్ హాస్టల్స్ (కాలేజీ విద్యార్థులు) లో హుజురాబాద్లో బాలురు -170, జమ్మికుంటలో బాలికలు-130 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు నోట్ బుక్స్, నాలుగు జతల దుస్తులు, బెడ్ షీట్, కార్పెట్, షూస్, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్స్ అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో ట్యూటర్లచే ప్రత్యేక తరగతులు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, స్పోర్ట్స్ మెటీరియల్, టీవీ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. విద్యా సంవత్సరంలో ఉచిత విజ్ఞాన విహారయాత్రలు కూడా నిర్వహిస్తారని తెలిపారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 4 ఫోటోలు, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనఫైడ్ (ఒరిజినల్), ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ సమర్పించాలని, మరిన్ని వివరాల కోసం హుజూరాబాద్ డివిజన్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డిని 9399957788 ఫోన్లో సంప్రదించవచ్చని సూచించారు.