కరీంనగర్ : సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్యంలో సాధించిన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందని, బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Ministre Gangula) పేర్కొన్నారు.కొత్తపల్లి మండలం చింతకుంటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ(Brs party) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఉండే అధిష్టానం తెలంగాణ బాగోగులు చూడదని, గల్లీలో ఉన్నవాళ్లే బాగోగులు చూస్తారని పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేని ఢిల్లీ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తలాపున గోదావరి(Godavari)ని, తెలంగాణకు కాంతిలిస్తున్న ఎన్టీపీసీ(NTPC)ని కాపాడుకోవాలంటే సీఎం కేసీఆర్(CM KCR)ను మరోసారి నిండుమనుసుతో దీవించాలని కోరారు. కరీంనగర్‌కు సినీ ఇండస్ట్రీ తరలివస్తుందని, మెడికల్ కాలేజీ, వెంకటేశ్వర టెంపుల్, సెంటర్ల బ్యూటిఫికేషన్, కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్‌తో నగరాన్ని అభివృద్ధి చేసుకున్నామని వెల్లడించారు.
గత 75 సంవత్సరాలల్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా సాగునీరు, తాగునీరు, గ్రామాలకు రోడ్లుకూడా లేవని, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ప్రతీ సమస్య సమసిపోతుందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, పింఛన్లు, లక్షలాది ఉపాధి అవకాశాలతో తరలొస్తున్న పరిశ్రమలతో తెలంగాణ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు.
అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులు పాదయాత్రల పేరుతో ఆంధ్రా నుంచి ఒకరు, ఓటుకు నోటు కేసులో వ్యక్తి ఒకరు, పేపర్ లీకేజీ మనిషి మరొకరు దండయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. వీరికి తెలంగాణపై ప్రేమలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.