కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ కారు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మైనర్ కారును 100 స్పీడ్తో నడపడం వల్లే కారు ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కారులో ఉన్నారు. ప్రమాదానికి 5 నిమిషాల ముందే కారులో పెట్రోల్ కొట్టించి.. కమాన్ చౌరస్తాలో రాంగ్ రూట్లో కారు వేగంగా వెళ్లి గుడిసెలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలుడికి సరిగ్గా డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని పోలీసులు భావిస్తున్నారు. కారు యజమాని, కారు నడిపిన మైనర్ తండ్రి రాజేంద్రప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ కేసులో ముగ్గురు మైనర్లే అని కరీంనగర్ సీపీ మీడియాకు వెల్లడించారు. మైనర్లే నలుగురు యువతుల మృతికి కారణం అయ్యారని సీపీ తెలిపారు. కారు నెంబర్ టీఎస్ 02 ఈవై 2121 మీద 8 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.