Accident insurance | ముకరంపుర, మే 26: ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని చెంజర్ల సెక్షన్లో ఏఎల్ఎం గా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జోగు నరేష్ కుటుంబానికి సోమవారం ప్రజాభవన్ లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రూ.కోటి ప్రమాద బీమా చెక్కు అందించారు. అదేవిధంగా మృతుడి సతీమణి జోగు సుష్మకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ ఉత్తర్వులు అందజేశారు.
నియామక పరిహారంతో పాటు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వ ఆలోచన, నిబద్దత, కార్యాచరణకు నిదర్శమని డిప్యూటీ సీఎం అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టామన్నారు. రూ. కోటి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులందరిలో కొత్త భరోసా నింపుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ అభినందించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు అశోక్ కుమార్, సదర్ లాల్, తిరుపతి రెడ్డి, మధుసూదన్, యూబీఐ బ్యాంకు ఉన్నతాధికారులు సర్వేశ్ రంజన్, భాస్కర్ రావు, అపర్ణ రెడ్డి కరీంనగర్ ఎస్ఈ మేక రమేష్ బాబు, డీఈ తిరుపతి, ఏఈ రమేష్, లక్ష్మణమూర్తి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.