నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఎక్సైజ్ పర్మిట్ రూంల దందాతో అందుతున్న మామూళ్ల బాగోతం అవినీతి నిరోధక శాఖకు చిక్కింది. పర్మిట్‌రూంల నిర్వాహకులు నెలనెలా ఇస్తున్న లంచాల చిట్టా ఏసీబీ కోర్టుకు చేరింది. ఈ మేరకు పర్మిట్ రూంలో నిర్వహిస్తున్న పలు క్యాష్ బుక్కుల ద్వారా ఆధారాలను సేకరించిన అవినీతి నిరోధక శాఖ.. మరిన్ని వివరాల కోసం లోతుగా అన్వేషణ ప్రారంభించినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు అందిన చిట్టా ప్రకారం చూస్తే.. సంబంధిత అధికారుల కళ్లు బైర్లు కమ్మే నిజాలు బహిర్గతమైనట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు కొంత మంది ఎక్సైజ్ అధికారుల అవినీతి, అక్రమాల దందాపై పక్కాగా ఆధారాలు సేకరించిన ఏసీబీ.. చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఉమ్మడి జిల్లాలో 200ల పైచిలుకు పర్మిట్ రూంల నుంచి నెలనెలా ముడుపులు ముడుతున్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు.. వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముడుపుల భాగోతంలో కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు రిక్తహస్తమే చూపుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం.
– కరీంనగర్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎక్సైజ్‌శాఖలో జరుగుతున్న అవినీతిపై ‘మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌శాఖ?’ శీర్షికతో ఈ నెల 7న ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయినా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్ రూంలపై ఎలాంటి దాడులు, చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరు, దాని వెనుక జరుగుతున్న మామూళ్లు, అధికారుల అండదండలు వంటి అంశాలను ఎండగడుతూ ఈ నెల 11న ‘అధికారుల అండ.. ఆగని పర్మిట్ రూంల దందా’ పేరుతో మరో కథనం ప్రచురితమైంది. ఈ రెండు కథనాలు ఎక్సైజ్‌శాఖలో కలకలం రేపుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధానంగా క్షేత్రస్థాయి అధికారులు.. ముఖ్యంగా కానిస్టేబుల్ స్థాయిలో ఈ చర్చ అధికంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మామూళ్ల పంపకాల్లో పై అధికారులే వాటాలు పంచుకుంటూ కానిస్టేబుళ్లకు రిక్తహస్తం చూపుతున్నట్లుగా సమాచారం. నిజానికి జరుగుతున్న అక్రమాలు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ సాగుతున్న పర్మిట్‌రూంల అక్రమాలు వంటి అనేక అంశాలను పలువురు కానిస్టేబుళ్లు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోగా “మీ కేమి పనిలేదా?” అంటూ సదరు కానిస్టేబుళ్లనే ఆ పైస్థాయి అధికారులు బెదిరించడం వారికి రుచించడం లేదు. ఇదిలా ఉంటే ‘నమస్తే’ కథనాలను పరిగణలోకి తీసుకొని జరిగిన తప్పులను సరిదిద్దుకొని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్‌రూంల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన సదరు అధికారులు అది మరిచిపోయి ‘నమస్తే తెలంగాణ’కు ఇంత ఖచ్చితమైన సమాచారం ఎవరు ఇస్తున్నారంటూ కొంత మంది ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూంలు నడుస్తున్న సమాచారం తెలిసి కూడా ఎక్సైజ్ ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. దీని వెనుక పెద్ద అవినీతి తతంగం దాగి ఉందని ఇప్పటికే ఆ వివరాలను ‘నమస్తే తెలంగాణ’ బహిర్గతం చేసింది. నిజానికి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఒక్కో పర్మిట్ రూం నిర్వాహకుల నుంచి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ అధికారులకు ముడుపులు ముడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వందల చదరపు అడుగుల్లో యథేచ్ఛగా నడుస్తున్న పర్మిట్ రూం నిర్వాహకుల నుంచి మాత్రం నెలనెలా దండిగా మామూళ్లు అందుతున్నాయని తెలుస్తోంది. సదరు వ్యాపారుల నుంచి నెలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మరికొంత మంది నుంచి నెలకు రూ.3 లక్షల వరకు ముడుపులు ముడుతున్న విషయంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద నెలకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ముడుపులు చేతులు మారుతున్నాయన్న చర్చ ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ చిట్టా ఏసీబీ చేతికి చిక్కింది. ఇటీవల ఓ సీఐ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అక్కడ కూపీలాగితే మొత్తం అక్రమాలు బహిర్గతమయ్యాయని విశ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్ రూముల్లో అనధికారికంగా నిర్వహించే క్యాష్ బుక్కుల్లో ఏరోజు ఏ అధికారికి ఎంత మామూలు ఇచ్చారో రాసి పెడుతున్నారని తెలుస్తోంది. ఆ మేరకు ఏసీబీ అధికారులు సదరు వివరాలు సేకరించారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఒక్కో క్యాష్ బుక్కును పరిశీలిస్తే.. ఏసీబీ అధికారులకే బైర్లు కమ్మేలా లంచాల గుట్టు బహిర్గతమైనట్లుగా తెలుస్తోంది. సదరు అధికారులకు అందిన సమాచారంతో అత్యంత పకడ్బందీగా ఇప్పటికే దాదాపు 200 పర్మిట్‌రూంల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్ల వివరాలను సేకరించారని తెలుస్తోంది.
నేరుగా ముడుపులు ఇస్తే అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు సదరు పర్మిట్ రూం నిర్వాహకుల నుంచి వేర్వేరు మార్గాల్లో ముడుపులు తీసుకుంటున్నారని గుర్తించిన ఏసీబీ.. ఆ వివరాల కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. కొంత మొత్తాన్ని మాత్రమే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తూ.. మిగిలిన మొత్తాన్ని క్యాష్రూపంలో అందజేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారని సమాచారం. దీంతో క్యాష్ ఎవరి నుంచి ఏ అధికారి వద్దకు వెళ్తుంది?, వాటిని ఎక్కడికి చేర్చుతున్నారు?, ఇందులో ఏ అధికారికి ఎంత ముడుతుంది?.. అన్న కోణంలో ఏసీబీ నిశిత పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది మాత్రం నేరుగా ఆన్లైన్ పేమెంట్లను కూడా అంగీకరిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం బంధువుల నంబర్లు ఇచ్చి పేమెంట్ వచ్చిన తదుపరి అక్కడి నుంచి వేర్వేరు మార్గాల్లో సంబంధిత అధికారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఓ సీఐ వ్యవహారం కూడా ఇలాగే నడిచింది. అతడికి సంబంధం లేని ఓ ఉపాధ్యాయుడిని మధ్యలో పెట్టుకొని అతని అకౌంట్‌కు ముడుపులు ఆన్లైన్ ద్వారా వేయించుకొని, తిరిగి అక్కడి నుంచి తీసుకున్న వ్యవహారం బహిర్గతమైన విషయం తెలిసిందే. ఎక్సైజ్‌శాఖలో ఇదే విధానాన్ని చాలా మంది అనుసరిస్తున్నారని సమాచారం.
మామూళ్ల వ్యవహారంపై అందుతున్న సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. ఇందులో కానిస్టేబుల్ తరహా పోస్టులకు సంబంధం లేదని తెలుస్తోంది. వీరు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నా నూటికి 90 శాతం మంది కానిస్టేబుళ్లకు ఈ పాపంలో భాగస్వామ్యం లేదని సమాచారం. లంచాల వసూళ్లు అనేవి ఓ సీఐ స్థాయి అధికారుల నుంచే ప్రారంభం అవుతున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం. నిజానికి ఆస్థాయి అధికారులే వసూళ్లు చేసి వారి స్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారుల వరకు వాటాలు పంచుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన నెలనెలా వచ్చే మామూళ్లు మొత్తం మధ్యస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకే ముడుతున్నాయని స్పష్టమవుతోంది. నిజానికి అధికారుల అవినీతిపై ఈ మధ్య కాలంలో కానిస్టేబుళ్లలో పెద్ద చర్చే జరుగుతోంది. విధి నిర్వహణలో భాగంగా ఎవరైనా కానిస్టేబుల్ పర్మిట్ రూంల వద్దకు వెళ్తే.. సదరు నిర్వాహకులు అతడిని లెక్క చేయకుండా నేరుగా ఉన్నతాధికారులకే ఫోన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘ఈ నెల మామూలు పంపించాం కదా?. మళ్లీ ఎందుకొచ్చారు?’ అంటూ ప్రశ్నించడంతో అధికారులు కానిస్టేబుళ్లపై విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ ముడుపులకోసం ఆరాట పడకుండా నిబంధనల ప్రకారం దుకాణాలు నడిచేలా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉండగా, మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీలోనూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయంపైనా ఆ శాఖలో పెద్ద చర్చే జరుగుతోంది.