ABS Bike | తిమ్మాపూర్, జూలై 6: ఒకప్పుడు ఇంటికొక సైకిల్ ఉండేది. నేడు మారుతున్న పోకడకు అనుగుణంగా ఇంటికి రెండు, మూడు ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. కాలు తీసి బయట పెట్టాలన్నా.. బైక్ వాడకమే ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ ప్రమాదాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ద్విచక్రవాహన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణిస్తుండగా.. వందల సంఖ్యలో గాయాలపాలౌతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహన ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం)ను ప్రవేశపెట్టనున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారుగా 5లక్షల ద్విచక్రవాహనాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఏడాదికి 4600 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్అవుతున్నాయి. సగటున నెలకు 3-4వందల వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికమవుతున్నాయి. వాహనదారులతో పాటూ వెనుక కూర్చున్న వారు బాధితులుగా మారుతున్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు అధికారులు, యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. యాంటీ బ్రేక్ లాక్ సిస్టం ఇప్పటికే కొన్ని ద్విచక్రవాహన సంస్థలు వాహనాలకు అమర్చి ఇస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇవ్వడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 150 సీసీ కలిగిన వాహనాలన్నింటికీ ఈ ఏబీఎస్ అమర్చేలా చేయనున్నారు. బైక్ ప్రమాదాలు తీవ్రమౌతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకురానున్న యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో ప్రమాదాలు నివారించవచ్చనే యోచలో ప్రభుత్వం ఉంది. ఇది వాహనాలను కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ. బురద, తడి, ఒడుదొడుకులు, జారుడు రోడ్లపై అదుపుతప్పకుండా బైక్ను కంట్రోల్ చేస్తుంది. సడెన్ బ్రేక్ సమయంలో వాహనం పడిపోకుండా బ్రేకింగ్ సిస్టంను నిరోధిస్తుంది. దీంతో వాహనం స్కిడ్ కాకుండా ఉండే వీలుంటుంది. చక్రాలకు అనుసంధానంగా సెన్సార్లను వినియోగించడం ద్వారా సెకన్ల వ్యవధిలో వాహనం నియంత్రించే శక్తి దానికి ఉంటుందని రవాణా శాఖ అధికారులు, నిపుణులు చెబుతున్నారు.
సేఫ్టీ ఉంటుంది : శ్రీకాంత్ చక్రవర్తి, డీటీవో, కరీంనగర్
యాంటీ బ్రేకింగ్ సిస్టం ఇప్పటికే అందుబాటులో ఉంది. కొన్ని సంస్థలు మాత్రమే బిగించి ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రతీ వాహనానికి అమర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది ఉండడం వల్ల సేఫ్టీ పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, ఏదైనా వాహనం ఎదురుగా క్షణాల్లో వచ్చినప్పుడు అదుపుతప్పి పడిపోతున్నారు. ఈ వ్యవస్థ ఉంటడం వల్ల వాహనం అదుపుతప్పే అవకాశం ఉండదు. వాహనదారులు అధిక స్పీడు కాకుండా నెమ్మదిగా వెళ్లడం అలవాటు చేసుకోవాలి.