Aadhar card update | పెద్దపల్లి, మే26: ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 -15 ఏళ్లలోపు గలవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలన్నారు.
ఆధార్ కార్డు వివరాలు అప్ డేట్ చేసుకునేందుకు గానూ వచ్చే నెల 3వ సోమవారం కలెక్టరేట్లో మెగా క్యాంప్ ఏర్పాటుకు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండల కేంద్రాలలో ఆధార్ కార్డు వివరాల అప్డేట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు ప్రణాళిక రూపొందించాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో ఆధార్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తప్పుడు చిరునామాతో పోస్టల్ కార్యాలయం నుంచి ఆధార్ కార్డులు వెనక్కి వచ్చాయో వివరాలు అందించాలన్నారు.
ఈ సమావేశంలో యూఐడీఏఐ ప్రాజెక్టు మేనేజర్ నరేష్ చంద్రా, డీడబ్ల్యూవో వేణు గోపాల రావు, డీఈవో డీ మాధవి, డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి, ఈడీఎం కవిత , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.