Suicide | ధర్మారం జూన్ 24: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సతీష్ కు భార్య శ్రీలత తో పాటు ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు. సతీష్ కొంతకాలం పాటు గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ ఉద్యోగిగా పని చేశాడు. కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు .ఈ క్రమంలో అతడు మద్యం తాగుడుకు బానిస అయినాడు.
ఈనెల 20న సతీష్ దొంగతుర్తి గ్రామానికి వచ్చాడు. గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు చేరుకొని మద్యం తాగిన మైకంలో కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపించాడు. వీడియో కాల్ చేస్తూనే పురుగుల మందు తాగి అతడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న సతీష్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానకు అదే రోజు తరలించారు.
చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి సోమవారం రాత్రి సతీష్ మరణించినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. సతీష్ మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.