గంగాధర, ఆగస్టు 20 : గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో మల్లవ్వ కుటుంబ సభ్యులు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వృద్ధురాలు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.
గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన గంగరాజు అనే యువకుడి సూచన మేరకు కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన దేవునూరి సతీష్, దేవనూరి శ్రావణ్ అనే యువకులు మల్లవ్వను కిడ్నాప్ చేసి గంభీరావుపేట శివారులోని పెద్దమ్మ స్టేజి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వృద్ధురాలు మల్లవ్వను హత్య చేసి ఆమెపై ఉన్న ఆభరణాలను దోచుకుని, శవాన్ని చెత్తకుప్పలో పడవేసి వెళ్ళిపోయారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులు దేవునూరి సతీష్, దేవనూరి శ్రావణ్ ను పోలీసులు అరెస్టు చేసి వారి నుండి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేవనూరి సతీష్ పై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు, కొట్లాట కేసు నమోదై విచారణలో ఉన్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు గంగరాజు, మరికొందరు సహచరులు పరారీలో ఉన్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గంగరాజు దొరికితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ వంశీకృష్ణ, పోలీసు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.