జమ్మికుంట, నవంబర్ 4: ‘ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. మీ బిడ్డగా ఆశీర్వదించండి. అసెంబ్లీకి పంపండి. ప్రజా వ్యతిరే శక్తులైన కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే అరిగోసపడ్తం. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు. ఏడుసార్లు గెలిచి, మంత్రిగా పనిచేసి.. ప్రజా సమస్యలను పట్టించుకోని వ్యక్తి మనకు అవసరమా..? ఆలోచించాలే.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇచ్చిన మాట తప్పితే మరోసారి మిమ్మల్ని ఓటు అడగ..’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి హామీ ఇచ్చారు.
శనివారం ఆయన జమ్మికుంట మండలంలోని నగురం, నాగారం, వావిలాల, పాపక్కపల్లి, సాయంత్రం మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం(9,10,11 వార్డులు)లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా ప్రచార కార్యక్రమాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల తర్వాత అర్హలందరికీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంటనే వావిలాలను మండలంగా చేసి తీరుతారని స్పష్టం చేశారు. జమ్మికుంట మున్సిపల్ ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మరో సిద్ధిపేటగా మారుస్తానని హామీ ఇచ్చారు. నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని, జమ్మికుంట చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డుకు కృషి చేస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ కండువా మీద గెలిచిన నాయకులు కొందరు ఇతర పార్టీలకు అమ్ముడు పోతున్నారని, పార్టీకి ద్రోహం చేసిన నాయకులను ఊళ్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని కౌశిక్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రతిపక్షాలు రంగం సిద్ధం చేశాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ బొమ్మపై గెలిచిన జడ్పీటీసీ శ్యాం ప్రజలకు సేవెలా చేస్తారని ప్రశ్నించారు. పైసల కోసం పార్టీలు మారుతున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అంతకుముందు పాడి ప్రచారం సందర్భంగా గ్రామాల్లో ప్రజ్రాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్, వైస్ ఎంపీపీ తిరుపతిరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు లింగారావు, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, నాగారం, నగురం, వావిలాల, పాపక్కపల్లి గ్రామ సర్పంచులు రాజ్‌కుమార్, పద్మ-రాజేశ్వర్‌రావు, శ్రీలత-సత్యం, మహేందర్, ఎంపీటీసీ మర్రి మల్లేశం, 9,10,11వ వార్డు కౌన్సిలర్లు రాము, విజయలక్ష్మి-మల్లయ్య, కళావతి-మోహన్, గ్రామశాఖ, వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.