పెద్దపల్లి, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మోటర్లు లేక మూలనపడ్డ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం)ని పునరుద్ధరించేందుకు సింగరేణి అధికారుల బృందం నడుం బిగించింది. ‘కాలుష్యం కోరల్లో ఖని’ అనే శీర్షికన ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. రెండేండ్ల తర్వాత ఎస్టీపీ తలుపులు తెరిపించి, రంగులు వేయించి, ట్యాంకులు బిగియించి, మోటర్లను అమర్చింది. నీటిని శుద్ధిచేసి నర్సరీకి వినియోగించే విధంగా ఏర్పాట్లు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని పట్టణంలోని ప్రధాన నాళాల నుంచి వెలువడే వ్యర్థపు నీటిని భారీ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధిచేసి సింగరేణి నర్సరీలు, స్థానిక అవసరాలు, సమీప పంటపొలాలకు పంపిణీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
అయితే రామగుండం రీజియన్-1 పరిధిలో నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూలనపడ్డాయి. 17 కోట్లతో నిర్మిస్తున్న ఎస్టీపీ మూడేళ్లయినా పూర్తి కాకపోగా.. గోదావరిఖని ఇైంక్లెన్ వద్ద 80లక్షలతో నిర్మించిన ఎస్టీపీలోని మోటర్లు చోరీకి గురికావడంతో రెండేళ్లుగా మూతపడింది. దీంతో కాలువల నుంచి వెలువడే దుర్గంధం, మురుగునీటి కారణంగా గోదావరిఖని కోల్‌బెల్ట్ ఏరియాలో కాలుష్యం కోరలు చాస్తున్నది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనిపై నమస్తే తెలంగాణ స్పందించి, ఈ నెల 22న ‘కాలుష్యం కోరల్లో ఖని’ శీర్షికన కథనం ప్రచురించగా, ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్ స్పందించారు.
ఈ క్రమంలో సింగరేణి అధికారులు మోటర్లు లేక మూలనపడ్డ ఎస్టీపీని పునరుద్ధరించి ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. అదేవిధంగా కొద్దిపాటి నిధుల కొరతతో 17కోట్లతో నిర్మాణాలు ప్రారంభమైన మరో ఎస్టీపీ పనులను సైతం వేగవంతం చేసేందుకు యాజమాన్యానికి లేఖలు చేశారు. ఆ పనులు సైతం వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్టీపీ మూతపడ్డ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులను సైతం నిర్లక్ష్యం చేసిన సింగరేణి యాజమాన్యం ‘నమస్తే’ కథనానికి మాత్రం వెంటనే స్పందించింది.
తక్షణమే 2/100కేఎల్డీ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురాగా.. నిర్మాణ దశలో ఉన్న 17ఎంఎల్డీ (17మిలియన్ లీటర్ ఫర్ డే) కెపాసిటీ ఉన్న సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ను సైతం త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమైంది. పునరుద్ధరిస్తున్న ఎస్టీపీతోపాటు నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎస్టీపీ నిర్వహణలో సక్రమంగా పనిచేసే కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ కాంట్రాక్టును అప్పగించాలని, మూలనపడకుండా చూడాలని కార్మికులు, కార్మిక నాయకులు కోరుతున్నారు.