Ramagiri | రామగిరి, మార్చి 6 : పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్‌తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించేలా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550 మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో పర్యాటక ప్రదేశానికి టూర్‌కు తీసుకెళ్తానని ఆయన తెలిపారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ వినూత్న ప్రకటనకు తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శైలజా మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో 19 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారని తెలిపారు. ఈ నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు పాఠశాలలో ప్రతీరోజు సాయంత్రం 8 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. స్టడీ అవర్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రతిరోజు స్నాక్స్ కూడా అందిస్తున్నామని హెచ్ఎం శైలజా తెలిపారు.
ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ మంతెన చంటి ముఖ్య అతిథి గా పాల్గొని తమ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ విద్యానందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడం పట్ల అభినందించారు.గతంలో కూడా ఇదే విధంగా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిన విధంగానే ఈసారి కూడా 550 మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో ఎక్కించి టూర్‌కు తీసుకెళ్లే ఆఫర్‌ను ఉపాధ్యాయుడు రాం కిషన్ రావు ప్రకటించడం పట్ల అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.