ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు. ఫైనాన్స్‌లో కొన్న ఆటోలకు నెలనెలా ఈఎంఐ కట్టలేని దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, ప్రతినెల జీవన భృతి 10వేలు, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవిత బీమా 5లక్షల పాలసీ సౌకర్యం కల్పించాలని కోరారు. సర్కారు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
– రాజన్న సిరిసిల్ల, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ ఆటోడ్రైవర్లు మండిపడ్డారు. తమ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్ని మండలాలకు చెందిన వందలాది మంది ఆటో డ్రైవర్లు ఆటోలతో శుక్రవారం జిల్లా కేంద్రానికి తరలివచ్చి ఆందోళన చేశారు. స్థానిక కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్, నేతన్న, గాంధీచౌరస్తాల మీదుగా కలెక్టరేట్ దాకా భారీ నిరసన ర్యాలీ తీశారు. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు బొల్లి రాంమోహన్, అధ్యక్షుడు పులినాగరాజు మాట్లాడుతూ తాము డిగ్రీలు చదువుకున్న ఉద్యోగాలు దొరక్క ఆటోలు నడుపుకుంటూ జీవనం గడిస్తున్నామన్నారు. రోజుకు 500 సంపాదించే మాకు కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల కనీసం 100 కూడా సంపాదన రావడం లేదన్నారు. ఫైనాన్స్‌లో అప్పు తీసుకుని ఆటోలు కొనుక్కున్నామని, నెలనెలా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఉండగా, కుటుంబ పోషణ భారమై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, ప్రతినెల జీవన భృతి 10వేలు, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవిత బీమా 5లక్షలు పాలసీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. సర్కారు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ అల్లె శ్రీనివాస్, బాపురెడ్డి, మల్లేశం, కరీం, బండి సాయికుమార్, రవి, అంజయ్య, హరీశ్ ఉన్నారు.