దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. సమూల మార్పులే లక్ష్యంగా పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) హస్తినలో సగర్వంగా జెండా ఎగురవేసింది. బుధవారం ఢిల్లీ గడ్డపై పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా, గులాబీ శ్రేణులు నూతనోత్సాహంలో మునిగిపోయాయి. ఊరూరా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ, స్వీట్లు పంచి పెట్టి సంబురాలు చేసుకున్నాయి. ‘జై కేసీఆర్’ ‘జయహో బీఆర్ఎస్’ నినాదాలతో హోరెత్తించాయి.

కరీంనగర్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో సమూల మార్పులే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పురుడు పోసుకున్నది. ఉద్యమ పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి, రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులెత్తించిన టీఆర్ఎస్.. ఈ నెల8న అధికారికంగా బీఆర్ఎస్
గా రూపాంతరం చెందింది. 9న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వేడుక నిర్వహించగా, బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జెండా పండుగ ఘనంగా జరిపారు. సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు.

మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, పాడి కౌశిక్‌రెడ్డి, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, సిరిసిల్ల ఆర్బీఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీర్ల వేంకటేశ్వరరావు, మూలవిజయారెడ్డి పాల్గొన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం పంపిణీ చేశారు.
జిల్లాలో సంబురాలు
ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచారు. కరీంనగర్లో పార్టీ సీనియర్ నాయకుడు పెండ్యాల మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. జూలపల్లిలో పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి సంబురాలు చేసుకున్నారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడు, కేసీఆర్ సేవా దళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్ పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత పలువురికి స్వీట్లు పంచి పెట్టారు. అలాగే పెద్దాపూర్‌లోని శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు డా.వాసంపెల్లి ఆనంద్ బాబు ఆధ్వర్యంలో వినూత్నంగా అభిమానం చాటుకున్నారు. ‘బీఆర్ఎస్.. కేసీఆర్’ అక్షరాలతో వేడుక జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు.