కోల్‌కతా: రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో స్కూల్ వ్యాన్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు మరణించారు. (Train hits school van) పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో కర్ణ సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ వద్ద గోవిందాపూర్ రైల్ గేటు తెరిచి ఉన్నది. 10 మంది పిల్లలతో వెళ్తున్న బెర్హంపూర్‌లోని స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో వేగంగా వచ్చిన లోకల్ రైలు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్కూలు పిల్లలు, సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి మరణించారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పిల్లలు, డ్రైవర్‌ను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఐసీయూలో చేర్చారు. ఆ తర్వాత గాయపడిన మిగిలిన విద్యార్థులను కూడా ఇక్కడకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు రైల్వే, గేట్‌కీపర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న గేట్‌కీపర్ రైలు వచ్చే సమయంలో రైల్వే గేట్ వేయలేదని ఆరోపించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం పది మంది సభ్యుల బృందాన్ని రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి పంపారు. రైల్వే, స్థానిక పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా తూర్పు రైల్వే హౌరా డివిజన్లోని అజీమ్గంజ్-కట్వా సెక్షన్లో రైళ్ల రాకపోకలు, సేవలకు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారి తెలిపారు.
Bengal : Two school students among three dead as train hits pool car at level crossing in Murshidabad. pic.twitter.com/rtNuIqZYl4
— News Arena India (@NewsArenaIndia) July 17, 2026