– నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి
కట్టంగూర్, జూలై 17 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన భూముల రీ-సర్వేకు రైతులు సహకరించాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. భూముల రీ సర్వేలో భాగంగా శుక్రవారం కట్టంగూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా భూ సరిహద్దులపై ఉన్న వివాదాలు తగ్గడంతో పాటు, ఖచ్చితమైన భూ రికార్డులు రూపొందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
తాసీల్దార్ పుష్పలత మాట్లాడుతూ రైతులు తమకు సంబంధించిన భూ పత్రాలు సిద్ధంగా ఉంచుకుని సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం భూముల వివరాలు పారదర్శకంగా నమోదు చేయబడతాయని, భవిష్యత్లో భూములకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోవ్వాకుల రాంబాబు, ఆర్ఐ రామారావు, జీపీఓ వెంకటేశ్వర్లు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ, సర్వే సిబ్బంది, గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.