న్యూఢిల్లీ: భారతీయ వైమానికి దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలు.. తొలిసారి విదేశీ సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన నాలుగు రఫేల్ విమానాలు.. ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నాయి. అక్కడ జరిగే పిచ్ బ్లాక్ సైనిక విన్యాసాల్లో ఆ యుద్ధ విమానాలు తమ సత్తాను ప్రదర్శించనున్నాయి. సుమారు 19 దేశాలకు చెందిన యుద్ధ విమానాలు ఆ విన్యాసాల్లో ప్రాతినిధ్యం వహించనున్నాయి. పిచ్ బ్లాక్ పేరుతో సాగే సైనిక విన్యాసాల్లో మొత్తం 100 యుద్ధ విమానాలు పాల్గొంటాయి. సుమారు 2500 మంది సిబ్బంది ఆ విన్యాసాలకు హాజరుకానున్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వైమానిక యుద్ధ క్షేత్రాల్లో తమ సామర్థ్యాలను ఆయా దేశాలు పరీక్షించుకోనున్నాయి. మిత్ర దేశాల వైమానిక దళాలతో కలిసి ఐఏఎఫ్ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు భారతీయ వైమానిక దళం తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది.
డార్విన్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. హిందూ మహాసముద్రం, తీమోర్ సముద్రం మీదుగా ఆ విమానాలు వెళ్లాయి. రఫేల్ యుద్ధ విమానాలకు తోడుగా ఐఎల్-78 మిడ్‌ఎయిర్ రీఫ్యూయల్లర్స్, సీ-17 స్ట్రాటజిక్ హెవీలిఫ్టర్ విమానాలు కూడా వెళ్లాయి. ఈ యుద్ధ విమానాలతో పాటు సుమారు 120 మంది ఐఏఎఫ్ సిబ్బంది ఆస్ట్రేలియా చేరుకున్నారు. యుద్ధ విన్యాసాల్లో ఐఏఎఫ్‌కు చెందిన రఫేల్ విమానాలు పాల్గొనడం ఇదే మొదటిసారి. గతంలో ద్వైపాక్షిక విన్యాసాల్లో కేవలం సుఖోయ్, సీ-17, సీ130 విమానాలు మాత్రమే పాల్గొనేవి. అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటనింగ్, ఎఫ్-ఏ 18 సూపర్ హార్నెట్, ఈఎఫ్-2000 టైఫూన్, ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ కూడా షోలో పాల్గొనున్నాయి.
పిచ్ బ్లాక్ సైనిక విన్యాసాలను 1981 నుంచి నిర్వహిస్తున్నారు. 1983 నుంచి అమెరికా ఆ ఈవెంట్లో పాల్గొంటోంది. 1990 నుంచి సింగపూర్ ఆ ఈవెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 20 దేశాలు ఈ ఈవెంట్లో తమ సైనిక సత్తా ప్రదర్శించనున్నాయి.
The #IndianAirForce contingent has landed in Australia for Exercise Pitch Black 2026. The premier biennial multinational air combat exercise brings together Air Forces of 19 nations. It provides a unique platform to enhance interoperability and strengthen… pic.twitter.com/qelHCb0m2g
— Indian Air Force (@IAF_MCC) July 17, 2026