Gold Loan fraud | హుజూరాబాద్, జూన్ 18: ఓ ప్రబుద్ధుడు ఏకంగా గోల్డ్ లోన్ సంస్థకే టోకరా పెట్టి సినీ ఫక్కీలో రూ.22 లక్షల 50 వేలతో ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్ మండలానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల గోల్డ్‌లోన్ సంస్థ కార్యాలయానికి వెళ్లాడు.
అక్కడ ఉన్న సిబ్బందితో తాను పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో 32 తులాల బంగారం తాకట్టు పెట్టానని.. వాటిని విడిపించడానికి రూ.22 లక్షల 50వేలు అవుతాయని చెప్పాడు. దీని కోసం మీ ఫైనాన్స్ డబ్బులు సర్దితే తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించి దానిని ఇక్కడ కుదువపెడుతానని నమ్మబలికాడు. కృష్ణ చెప్పిన మాటలు నమ్మిన సదరు గోల్డ్ లోన్ సంస్థ సిబ్బంది సరేనని ఒప్పుకున్నారు.
సంస్థ ఉద్యోగులు కృష్ణతో కలిసి డబ్బులు పట్టుకొని బంగారాన్ని విడిపించేందుకు అతడు చెప్పిన బ్యాంకుకు వెళ్లారు. అయితే గోల్డ్ లోన్ సంస్థ ఇచ్చిన డబ్బులపై కన్నేసిన కృష్ణ మార్గమధ్యలో తనకు మూత్రం వస్తుందని చెప్పి వారిని నమ్మించాడు. కృష్ణ మూత్రశాలవైపు వెళ్లినట్లుగా నటించి ఉద్యోగుల కళ్లుకప్పి మొత్తం డబ్బులతో ఉడాయించాడు.
మూత్రశాలవైపు నుంచి కృష్ణ ఇంకా తిరిగిరావడం లేదని గమనించిన సిబ్బంది ఎంతకు రాకపోయేసరికి కృష్ణకు ఫోను చేశారు. ఇంకేముంది అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన సదరు గోల్డ్ లోన్ సంస్థ ఉద్యోగులు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్