ఇచ్చోడ, ఫిబ్రవరి 21 : ఇది పరీక్షల సమయం. ఈనెల రోజులు విద్యార్థులకు చాలా కీలకం. సెల్ఫోన్, టీవీ, ఆటలకు దూరంగా ఉంటేనే మంచి మార్కులు సాధించొచ్చు. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. ఈనెల 25 నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికితోడు పదో తరగతి రెండో ప్రీ ఫైనల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 18 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా, వీటికి హాజరయ్యే విద్యార్థులకు ఈ సమయం చాలా ప్రధానం. ఈనెల రోజులపాటు కష్టపడి చదివితే మంచి మార్కులు, గ్రేడింగ్ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదువుకు ఆటంకం కలుగకుండా విద్యార్థులు సినిమాలు, టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లకు దూరంగా ఉంటూ పోషకాహారం తీసుకుంటే మంచి ఫలితాలు రావడం ఖాయం.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వారి మిత్రులతో కలిసి సినిమాలు చూడకపోవడం, తరగతి గదుల్లో సినిమాల విషయాలు చర్చించకపోవడం మంచిది. ప్రతి ఇంట్లో రెండు, మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. వీటికి విద్యార్థులు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. సెల్ఫోన్లు వాడడంతో కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చదువుపై ఏకాగ్రత పోయి చదువుకున్న అంశాలు కూడా మర్చిపోతారు. పిల్లలు టీవీ ప్రసారాలు చూస్తే పుస్తకాలకు దూరమవుతారు. దీంతో ఇండ్లలో టేబుల్ టీవీ కనెక్షన్ను దూరం పెట్టడం మంచిది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు చదువుకొనే సమయంలో టీవీలు పెట్టకూడదు.
ఇంట్లో కంప్యూటర్ ఉంటే విద్యార్థులు దానిపై ఆడడానికి మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులకు తెలియకుండానే ఇంటర్ నెట్, ట్విట్టర్, ఫేస్బుక్ వినియోగిస్తుంటారు. వీటి మోజులో పుస్తకాలకు దూరమవుతారు. పనికిరాని అంశాల కన్నా పుస్తకాలు చదివేందుకు సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇక.. ప్రస్తుతం ఎవరు చూసిన క్రికెట్ ఆటవైపే మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు ప్రస్తుతం పలు సిరీస్లు జరుగుతుండ గా, విద్యార్థులు వాటిపై దృష్టి కేంద్రీకరించకుండా చూడాలి.
ఫిబ్రవరి-మార్చి నెలల్లో సాధారణంగా పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి. పరీక్ష రాసే విద్యార్థులు వీటికి వెల్లకూడదు. వీటన్నింటిని త్యజించి ఉపాధ్యాయులు సూచించిన ప్ర తి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఆయా జవాబులపై పట్టు సా ధించాలి. కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించి ప్రణాళికతో చదువును క్రమం తప్పకుండా అభ్యసనం, క్రమశిక్షణతో కూడి న ప్రిపరేషన్ చేయాలి. రోజుకో సబ్జెక్టుపై టైం టేబుల్ వేసుకొని సిద్ధమైతే మంచిదని ఆయా సబ్జెక్టుల నిపుణులు సూచిస్తున్నారు.
సిలబస్ పూర్తి కావడంతో పునచ్ఛరణ తరగతులు విద్యార్థులకు చాలా అవశ్యం. కొంత మంది విద్యార్థులు పరీక్షలకు ముందు బాగా చదువుతారు. హాల్లోకి వెళ్లగానే చదివింది మరిచిపోతుంటారు. ఇందుకు పరీక్షలంటే భయపడడమే కారణం. మొదటి పరీక్ష రాసినప్పుడే ఏది మరిచిపోయాం? ఎందుకు మర్చిపోయాం? అన్న విషయాన్ని గ్రహించాలి. విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
విద్యార్థులు తెలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. పరీక్షల సమయంలో ఆహారపు అలవాట్లలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఇష్టం వచ్చిన ఆహారం తింటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఆకు కూరలు, పాలు, చేపలు తినాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. నిద్రలేకుంటే మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉంది. రాత్రి 10 గంటల్లోపే విద్యార్థులు చదువుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి.