ఎదులాపురం, ఫిబ్రవరి 21 : విద్యార్థుల భవిష్యత్‌కు పదో తరగతి అత్యంత కీలకమైనదని, ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన శక్తినిచ్చేందుకు ప్రొటీన్ స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి చదివించాలని, రాత్రి 9 లేదా 10 గంటల వరకు క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేయాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. తద్వారా మొదటి సంవత్సరంలో మంచి ర్యాంకుతో సీటు సాధించవచ్చని ఆయన ఆకాంక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీఈడీ సెక్రటరీ గజేందర్, సెక్టోరల్ అధికారులు రఘురమణ, తిరుపతి, సాంకేతిక సిబ్బంది విలాస్ పాల్గొన్నారు.