కరీంనగర్ కలెక్టరేట్, మే 12: ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ సద్భావన ర్యాలీ తీశారు. కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, ప్రతిమ మల్టీప్లెక్స్, బస్టాండ్, సీఎస్ఐ చర్చి మీదుగా అమరవీరుల స్తూపం వరకు కొనసాగించారు.
వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు, యువజన, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, ఎన్సీసీ కేడెట్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల పోరాటాన్ని కీర్తిస్తూ నినదించారు. ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటాలతోపాటు జాతీయ జెండాలు ప్రదర్శించారు. జవాన్ల ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, సంతాపం ప్రకటించారు.