– ప్రమాదాలకు నెలవుగా రుద్రంపూర్ మార్గం
రుద్రంపూర్, ఫిబ్రవరి 09 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (RCHP) కు సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల నుండి వస్తున్న బొగ్గు టిప్పర్ల వల్ల ఈ దారిలో పరిసర ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లి నుండి రోజుకు 90 లారీల ద్వారా నాలుగు ట్రిప్పులు (సుమారు 360 ట్రిప్పులు), కోయగూడెం ఓసీ నుండి 30 లారీలు నాలుగు ట్రిప్పులు (సుమారు 120 ట్రిప్పులు) చొప్పున బొగ్గు రవాణా జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఒక్కో లారీ ఐదు ట్రిప్పులు కూడా చేయడంతో రోజుకు సుమారు 500 లారీలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. ఈ లారీలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారి మీద ప్రయాణించడంతో భారీగా దుమ్ము లేచి వెనుక వచ్చే వాహనదారులకు దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పగటి వేళలోనే ఈ స్థాయి ఉంటే, రాత్రిపూట పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇదే మార్గంలో ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేకమంది గాయపడగా, దుమ్ము కారణంగానే దృష్టి పరిమితమై ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. దుమ్ము నివారణకు నీటి స్ప్రింక్లర్లు, వాటర్ ట్యాంకర్ల ద్వారా రోడ్డుపై నీటిని స్ప్రే చేయాల్సిన బాధ్యత సింగరేణి అధికారులదే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ చర్యలు అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్లో జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇదే కాకుండా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు కూడా తీవ్ర ధూళి కారణంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో వాటర్ స్ప్రింక్లర్ల ద్వారా దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టిన అధికారులు ప్రస్తుతం ఎందుకు పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి, రవాణాపై ఉన్న శ్రద్ధ కార్మికుల ఆరోగ్యం, ప్రజల భద్రతపై కూడా చూపించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే రోడ్లపై, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పరిధిలో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని వెదజల్లాలని, దుమ్ము నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.