వరంగల్ జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేవాదుల ఎత్తిపోతల పథకం.. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిన ప్రాజెక్టు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును ప్రభుత్వం తన అవసరానికి నెత్తిన పెట్టుకొంటున్నది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమైంది.
రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించకుండా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం పథకాన్ని పడావు పెట్టిన ప్రభుత్వం.. విమర్శల వెల్లువ నుంచి తప్పించుకొనేందుకు దేవాదులను తెరమీదకు తెస్తున్నది. వాస్తవానికి రేవంత్‌రెడ్డి గురువైన చంద్రబాబు చేసిన కుట్రలపర్వం నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం పురుడు పోసుకొన్నది. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రీ డిజైనింగ్‌తో నూతన జవసత్వాలను అందిపుచ్చుకున్నది.
ఫలితంగా ఇప్పుడు ప్రజలను, ప్రభుత్వాన్ని ఆదుకొనేందుకు సిద్ధమైంది. అయితే, దేవాదుల నుంచి ఎంత ఎత్తిపోసినా కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చే ప్రతిఫలంలో కనీసం నూరోవంతు కూడా కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 2001లో కేసీఆర్ ఎగురవేసిన గులాబీ జెండాకు జడిసి, టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు నెలలకే చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లి జూన్ 16న దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. తెలంగాణ ఉద్యమ తీవ్రత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అశాస్త్రీయంగా, సరైన అధ్యయనం చేయకుండానే హడావుడిగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం గ్రామం వద్ద దేవాదులను మొదలుపెట్టారు. కరువుపీడిత మెట్ట ప్రాంతాలైన వరంగల్, హనుమకొండ, జయశంకర్-భూపాపల్లి, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని 34 మండలాల పరిధిలోని 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
1,541 అడుగుల ఎత్తున ఉన్న 190 కిలోమీటర్ల పరిధిలోని ఆయకట్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు. డిజైన్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉండటంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా 25 ఏండ్ల పొడవునా ప్రాజెక్టు పూర్తికావడానికి ఆపసోపాలు పడుతున్నది. గోదావరి నది నుంచి మూడు దశల్లో కలిపి దేవాదుల 38.182 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. ఇందులో 77,750 ఎకరాలు రీజనరేటెడ్ నీటితో సాగులోనికి వస్తాయని అంచనా వేశారు. అంటే దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే భూమి 5,42,250 ఎకరాలు.
ఈ లెక్కన ఒక టీఎంసీకి 15,360 ఎకరాలను సాగు లక్ష్యంగా నిర్ణయించారు. ఇక్కడే చంద్రబాబు అసలు కుట్ర తెలిసిపోతున్నది. 2001 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా 14 ఏండ్లపాటు ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని పదే పదే వార్తల్లో ఉంచుతూ నెట్టుకొచ్చారు. ప్రాజెక్టులో ఒక్క బరాజ్ లేకపోవడం, కాకతీయుల కాలంనాటి రామప్ప, ధర్మసాగర్ వంటి జలాశయాలనే స్టోరేజీకి చూపడం, అవి కూడా కనీసం రెండు టీఎంసీల సామర్థ్యం కన్నా తక్కువే ఉండడం వంటి అంశాలతో కాలం వెళ్లదీశారే తప్ప కొత్త రిజర్వాయర్‌ను ప్రతిపాదించలేకపోయారు.
ఈ లోపాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ సర్కార్ రీ-ఇంజినీరింగ్‌తో దేవాదుల రూపురేఖలను మార్చుకొని పరుగులు పెట్టించింది. డిజైన్ల మార్పు, భూసేకరణ, ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టులో 80 శాతానికి నీరు అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లికి నీటిని చేర్చడం ద్వారా దేవాదుల ప్రాజెక్టులోని ఆయకట్టుకు నీరందించిన ఘనత కేసీఆర్‌దేనని రైతుల అనుభవం స్పష్టంచేస్తున్నది.
6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించాల్సిన దేవాదుల ప్రాజెక్టుకు నీటి నిల్వ కోసం బరాజ్ లేకపోవడం పెద్ద సాంకేతికలోపం. త ర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమానికి జడిసి కంతనపల్లి బరాజ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొన్నది. అంతేకాదు.. దేశంలోని సాగునీటి ప్రమాణానికి భిన్నంగా దేవాదులను రూపొందించారు. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలు సాగవుతుంది.
కానీ దేవాదులలో మాత్రం 15 వేల ఎకరాలుగా లెక్కగట్టారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకోకుం డా ఉండేందుకు అనుసరించిన కుట్రలో భాగ మే ఈ అశాస్త్రీయ లెక్కలు అని తేలిపోతున్నది. గోదావరి నుంచి ధర్మసాగర్ దాకా ప్రాజెక్టులో ఆయకట్టు లేకపోవడం మరొక పెద్దలోపం. తమ కండ్ల ముందు నుంచి పైపులైన్ పోతున్నా, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లోని ఎగువ ప్రాంతాలు గోదావరి నీటి కోసం అల్లాడే పరిస్థితులు కల్పించాయి.
మొదటి దశ ద్వారా 353 క్యూసెక్కుల సామర్థ్యంతో 10.27 టీఎంసీ నీటిని ఎత్తిపోయడం ద్వారా 1,22,700 ఎకరాల ఆయకట్టుకు, రెండో దశలో 495 క్యూసెక్కుల 21.87 టీఎంసీ నీటిని 1,93,164 ఎకరాల ఆయకట్టుకు, మూడో దశలో ద్వారా 1,752 క్యూసెక్కుల సామర్థ్యముతో 17.67 టీఎంసీల నీరు 2,41,790 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
చారిత్రక కట్టడమైన రామప్ప ఆలయానికి ముప్పు కలుగకుండా రీ- ఇంజినీరింగ్‌లో మూడో దశలోని పనుల్లో ప్యాకేజీ నంబర్-2 భీంఘన్‌పూర్ నుంచి రామప్ప జలాశయానికి గోదావరి నీటిని సొరంగం మార్గం కాకుండా పైపులైన్ ద్వారా తరలించాలని నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి పూర్తిచేసింది. అలాగే, మూడో దశలోని ప్యాకేజ్ నం.3 పనులను భూగర్భ పంపుహౌస్ నిర్మాణాన్ని దేవన్నపేట (హన్మకొండ జిల్లా ధర్మసాగర్-హసన్‌పర్తి మండలాల సరిహద్దు)లో కేసీఆర్ సర్కార్ పూర్తిచేసింది.
రీ-ఇంజినీరింగ్‌లో భాగంగా మూడవ దశలోని పనుల్లో ప్యాకేజ్ నెం.5లో ముంపు ప్రభావం లేకుండా రంగయ్య, ఎర్రయ్య చెరువు పనులను తీసివేసి సిస్టర్న్‌లను నిర్మించి నీటిని పాకాల చెరువుకు అందించాలని కేసీఆర్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి దాదాపు పూర్తిచేసింది. దీంతో నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల చెరువు కింద ఉన్న 15,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, 7,000 ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు, ములుగు నియోజకవర్గములోని 8,000 ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం రామప్ప నుంచి పాకాల చెరువునకు పైపులైన్ ద్వారా పనులు పూర్తిచేశారు. అలాగే, ములుగు నియోజకవర్గంలోని లక్నవరం రిజర్వాయర్ కింద ఉన్న 8,700 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం రామప్ప నుంచి లక్నవరం గ్రావిటీ కెనాల్ కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం రూ.16.70 కోట్లకు అనుమతులిచ్చింది.
ఇటీవల మేడారం జాతర సందర్భంగా రేవంత్‌రెడ్డి సర్కార్ దీన్నే కొత్తగా చేపడుతున్నట్టు ప్రకటించటం గమనార్హం. ములుగు గణపురం చెరువు కింద ఉన్న సుమారు 26,000 ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు, 4,000 ఎకరాల స్థిరీకరణకు, రామప్ప నుంచి ములుగు ఘన్పూర్ కాలవ పనుల కొరకు ప్రభుత్వం రూ.17.58 కోట్లతో అప్పుడే అనుమతులు ఇచ్చి, పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సాగునీటి అవసరాలకు 36.23 టీఎంసీలు
గృహ అవసరాలకు 1.92 టీఎంసీలు
పారిశ్రామిక అవసరాలకు 0.012టీఎంసీలు
మొత్తం 38.16 టీఎంసీలు
దేవాదుల మూడు దశల్లోని అన్ని పంపులు సంవత్సరంలో 170 రోజులపాటు ఏకధాటిగా నడిస్తే నిర్దేశిత 38.16 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలవుతుంది. కానీ, దేవాదుల ప్రాజెక్టు పురుడు పోసుకొని పంప్‌లు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా గరిష్ఠంగా పంపులు నడిచింది కేసీఆర్ హయాంలోని తొమ్మిదిన్నరేండ్లేనని ప్రాజెక్టు లిఫ్ట్ లిస్ట్ స్పష్టం చేస్తున్నది. ఏకధాటిగా 110 రోజులు పంపులు నడిచిన దాఖలాలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదుల ప్రాజెక్టు విషయంలో ఇప్పటిదాకా చెప్పినవన్నీ కోతలేని తేలిపోయింది. ఇందుకు 2025 జూన్ నుంచి 2026 మే వరకు ఎత్తిపోసిన నీళ్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఏలుబడిలో ఏడాదంతా గోదావరి నుంచి దేవాదుల ద్వారా ఎత్తిపోసిన నీళ్లు కేవలం 18.203 టీఎంసీలే కావడం గమనార్హం. అంటే దాదాపు 20 టీఎంసీల లోటు నమోదైంది.
ఇక.. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, ముందుగానే శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరికి ఈ నెల 3వ తేదీ నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టింది. ఈనెల 14వ తేదీ వరకు గంగారం ఇన్‌టేక్ వెల్‌లోని 10 పంపుల్లో 7 పంపులు (రోజుకు రెండు నుంచి గరిష్ఠంగా 7 వరకు) నడిచినా 12 రోజుల్లో ఎత్తిపోసింది 1.075 టీఎంసీలే కావడం గమనార్హం.
