హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రకటనలతోనే కాలం వెల్లబుచ్చుతున్న ప్రభుత్వ పెద్దలు.. రైతుల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టడమే లేదు. వరిసాగు వద్దంటున్న పాలకులు.. ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలో చెప్పకుండా అన్నదాతలతో దోబూచులాడుతున్నారు.
ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల్లో సాగు, తాగునీటికి కటకట ఏర్పడింది. వానకాలం తొలి దశలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంటలు సాగు చేసేందుకు జంకుతున్నారు. ఓవైపు వరినార్లు ముదురుతున్నా సాగునీళ్ల జాడలేక నాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈసారి కరువు తప్పదేమో, పంటలు సాగేదెట్ల? అనే రందితో సతమతం అవుతున్నారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకటనలే తప్పా ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకొనేలా ఏ పంటలు సాగు చేయాలి? ఆ పంటలు వేస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభిస్తుంది? కొనుగోళ్లకు గ్యారంటీ ఉంటుందా? విత్తనాల లభ్యత ఎలా? అన్న అంశాలను ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పట్టించుకోవడమేలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కరువు సమయంలో సర్కార్ నుంచి ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో కార్యాచరణ కనిపించడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. 65 లక్షల ఎకరాల్లో వరిసాగు కావాల్సి ఉండగా 5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల సాగు పరిస్థితులను వివరించిన దాఖలాల్లేవు. వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి మూడు దశలో కాంటింజెన్సీ ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. తొలిదశను 15 నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. కాంటింజెన్సీ ప్లాన్లో భాగంగా ఎలాంటి చర్యలు ప్రారంభించారో తెలియదు.
గత ఆరు నెలలుగా సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట వరి వద్దు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని చెప్తున్నారు. కంది, జొన్న, సజ్జ, కొర్ర, రాగులను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటలను ఎలా సాగు చేయాలి? ఎక్కడెక్కడ వీటి సాగు అనుకూలంగా ఉంటుంది? అన్న అంశాలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని అంటున్న ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అందుకు రైతులు ఏం చేయాలనే విషయాలను మాత్రం చెప్పడంలేదు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు భరోసా కల్పించడమూ లేదు. దానికోసం కనీసం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచలేదని తెలిసింది. కొర్రలు, రాగుల విత్తనాలు అందుబాటులోనే లేనేలేవు.
ఈ విత్తనాల్లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ వద్ద గానీ, ప్రైవేట్ డీలర్ల వద్ద గానీ అందుబాటులో లేకపోవడం గమనార్హం. కేవలం జాతీయ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ వద్ద మాత్రమే కొర్రలు 2వేల ఎకరాలకు, రాగులు 33 వేల ఎకరాలకు సరిపడా విత్తనాలు మాత్రమే ఉన్నాయి. కందులు కేవలం 7 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలే ఉన్నాయి.
సాధారణంగానే కంది పంట 5-6 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. అంటే కేవలం మరో లక్ష ఎకరాలకు సరిపడా విత్తనాలే అందుబాటులో ఉండటం గమనార్హం. వేరుశనగ 37వేల ఎకరాలకు సరిపడా విత్తనాలే ఉన్నాయి. సాధారణంగానే 30 వేల ఎకరాల్లో సాగవుతుంది. ఇలా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పిన సర్కార్.. అందు కు సంబంధించి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైం ది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే విత్తనాలు సబ్సిడీలో ఇస్తామనే అంశాన్ని ప్రస్తావించడమే లేదు.ఆయా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనే భరోసాను కల్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు అయోమయంలో పడిపోయారు.