హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్‌లో తెరవెనుక భారీ రాజకీయ కసరత్తు మొదలైంది. సర్ ప్రక్రియ, పార్టీ, ప్రభుత్వం పక్షాన చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన పనులు, ఎదురవుతున్న సవాళ్లు, సోషల్ మీడియా మేనేజ్మెంట్, పార్టీని బలోపేతం చేసేందుకు సూచనలు కోరుతూ ఒక సర్వే పత్రాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చేతికి ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తవుతున్న వేళ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమ యం వేగంగా దగ్గరపడుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సర్వే చేపట్టినట్టు తెలుస్తున్నది. మొత్తం రెండు పేజీల ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో నాలుగో ప్రశ్నను ప్రజాప్రతినిధుల ఐచ్ఛికానికి వదిలేశారు. వంద పదాలకు మించకుండా అభిప్రాయం చెప్పాలని ఆదేశించారు. ఈ ప్రశ్నావళి రేవంత్‌రెడ్డి పనితీరును ఉద్దేశించేనని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై వారి నుంచి ప్రశ్నాపత్రం తీసుకుంటారు. ఈ నెల 13 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
రేవంత్ మీద రిపోర్టు కార్డు!
ప్రజాప్రతినిధులు నింపిన ఫారమ్‌ను గాంధీభవన్‌లో జరిగే వ్యక్తిగత సమావేశంలో తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌కు అందజేయాలని సూచించారు. నాలుగో ప్రశ్నపై ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైనది ఈ చివరి ప్రశ్నేనని పార్టీ నాయకులే చెప్తున్నారు. ప్రభుత్వం, నాయకత్వం, సమన్వయం, స్థానిక అసంతృప్తులు, నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం వ్యవహారశైలి, నిధుల లేమి, తమ పట్ల ముఖ్యమంత్రి వ్యవహారం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు కుండబద్దలు కొడతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో వరుసగా వెలుగులోకి వచ్చిన అంతర్గత విభేదాలు కూడా ఈ సర్వేకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య బహిరంగ విమర్శలు, జిల్లాల్లో వర్గపోరు, నేతల మధ్య సమన్వయ లోపాలు, పార్టీ పదవులపై అసంతృప్తి వంటి పరిణామాల నేపథ్యంలో అధిష్ఠానం క్షేత్రస్థాయి పరిస్థితిని నేరుగా తెలుసుకోవాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సర్వే ఆధారంగా కేవలం పార్టీ సంస్థాగత వ్యవహారాలనే కాకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న స్పందన, నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల ప్రభావం, స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అంశాలు ఎమ్మెల్యేల సూచనల్లో ప్రతిబింబించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ నివేదిక ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లిన తర్వాత ఎలాంటి రాజకీయ నిర్ణయాలు వెలువడతాయన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది.