హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఓ జోన్‌కు డీఐజీగా చేసిన అధికారి విధులు నిర్వర్తించిన అన్నిచోట్లా రహస్యంగా సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. దాదాపు వారం రోజులుగా సీఐడీ అధికారులు ఆ డీఐజీపై వచ్చిన అన్ని ఆరోపణలపై లోతుగా కూపీ లాగుతున్నారు. ఓ డీఐజీపై సీఐడీ విచారణ జరుగడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై ఆపై స్థాయి అధికారుల బదిలీల్లో ఆయన చేతివాటంపై ఎవరెవరు? ఎంతెంత ఇచ్చారు? అ నే దానిపై సీఐడీ అంతర్గతంగా తమ బృందాలను పంపి విచారణ చేయిస్తున్నది. ఆ డీఐజీ తన పరిధిలో జరిగే అన్ని బదిలీలకు నిర్దిష్టమైన రేటు ఫిక్స్ చేసుకోవడం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నది. హెడ్‌కానిస్టేబుల్ టు ఏఎస్సై ప్రమోషన్, పోస్టింగ్‌లలో ఆ డీఐజీ వ్యవహారం తన రేంజ్లో మరింత రచ్చకెక్కింది.
ఒక్కో పోస్టుకు కనీసం రూ.5 లక్షల వరకు డిమాండ్ చేశాడని విశ్వసనీయ సమాచారం. ఎస్సై పోస్టింగుల్లో రూ.10 లక్షల వరకూ డిమాండ్ చేసి.. ఎక్కడో ఓ చోట రేటుకు తెగ్గొట్టేస్తాడనే ప్రచారం ఉన్నది. మొదట తన పరిధిలోని జిల్లాల్లో దూర ప్రాంతాలకు బదిలీ చేసి.. మళ్లీ పాతచోటుకు రావాలంటే ఎంతోకొంత ముట్టజెప్పేలా వ్యవస్థను తయారు చేసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నా యి. కొందరు కానిస్టేబుళ్లు అనారోగ్య కారణాల వల్ల స్టేషన్ మారేందుకు రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా అతని సీసీ ద్వారా డబ్బులు డిమాండ్ చేయించారనే సాక్ష్యాలున్నాయి.
సదరు డీఐజీ అక్రమాలపై వారం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సీఐడీ అధికారులు.. సమగ్ర నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. నివేదికను డీజీపీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ అనుమతితో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి పంపే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అతనిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటేనే ఆ నివేదికను డీవోపీటీకి పంపిస్తారనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర చరిత్రలో ఒక ఐపీఎస్‌పై ఈ స్థాయిలో విచారణ జరుగడం ఇదే తొలిసారి. ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్టు ఆ డీఐజీ పర్యవేక్షణలోని ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సైతం అలాగే తయారయ్యారని పో లీసు వర్గాలు అంటున్నాయి.
డీఐజీగా వచ్చిన కొత్తలో ఓ డీఎస్పీతో తన వసూళ్ల పర్వాన్ని కొనసాగించినట్టు ఇప్పుడు బాధిత పోలీసులు చెప్తున్నారు. ఒక్కోస్టేషన్కు ఒక్కోరేటు ఫిక్స్ చేసి మరీ అతనితో వసూళ్లకు పాల్పడ్డట్టు పేర్కొంటున్నారు. ఆ డీఎస్పీ బదిలీపై వెళ్లడంతో ఓ ఎస్సైని తన బినామీగా పక్కన తిప్పుకొంటున్నాడని, అతనితోనే అన్ని వ్యవహాలు చక్కదిస్తున్నాడని చెప్తున్నారు. ఈ ఎస్సైకి ఓ ఇన్స్పెక్టర్ తోడవ్వడంతో వారి ఆగడాలు అంతా ఇంత కాదని ఆ రేంజ్‌లోని ఉన్నతాధికారులే ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి అతనిపై విచారణ ప్రారంభమవడంతో బాధితులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.