కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం సిరిసిల్లలోని మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో సిరిసిల్ల మానేరు వాగు నిండుకుండలా ఉండేదని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో మిడ్‌మానేరు పూర్తిగా ఎండిపోయిందని, సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే కన్నెపల్లి పంపుహౌస్ మోటర్లు ఆన్ చేసి సాగునీరు అందించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ డిమాండ్ చేశారు.
– సిరిసిల్ల టౌన్

‘రామ రామ రామ ఉయ్యాలో..వానలు కురువాలే ఉయ్యాలో..పంటలు మంచిగా పండాలే..మాకు పనులు దొరుకాలే ఉయ్యాలో..’ అంటూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం బలరావుపేటకు చెందిన మహిళా వ్యవసాయ కూలీలు పాటలు పాడుతూ వేడుకున్నారు. గ్రామానికి చెందిన 60 మంది మహిళలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవడంతో కూలి పనులు దొరుకడం లేదనే
ఆవేదనతో బుధవారం ఊరు చివరిలోని పోచమ్మ ఆలయం ఎదుట వర్షాలు పడాలని కోరుతూ పోచమ్మను వేడుకున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మంచిర్యాల