తిమ్మాపూర్, మార్చి 23: కరీంనగర్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అడుగడుగునా పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముందుగా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు ఆదివారం ఉదయం ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేసిన ఆయనను కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ తమ ఆకాంక్షను చాటారు. కేటీఆర్ అక్కడి నుంచి భారీ సంఖ్యలో కార్ల కాన్వాయ్‌తో కరీంనగర్ పయనమయ్యారు.
వరంగల్ సభకు తరలిరావాలి
బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25ఏండ్లు అయిన సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ వెళ్తున్న ఆయన తిమ్మాపూర్ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో కొద్దిసేపు ఆగి కార్యకర్తలతో ముచ్చటించారు. మండలంలో పార్టీ పటిష్టంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.
పలువురు కార్యకర్తలను ఇంటిపేర్లతో పిలవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్యక్రమాల్లో కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారెడ్డి, నాయిని వెంకట్‌రెడ్డి, పాశం అశోక్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, మార్చి 23: నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, పుట్ట మధు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో కార్యకర్తలు ఉత్సాహంగా సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో రాంనగర్‌కు తరలివెళ్లారు.
సతీశ్ అన్న బాగున్నవా..
మాజీ ఎమ్మెల్యేతో ఆప్యాయంగా ముచ్చటించిన కేటీఆర్
చిగురుమామిడి, మార్చి 23: సతీశ్ అన్న బాగున్నవా… అంటూ కరచాలనం చేస్తూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల సతీశ్‌కుమార్‌ను ఆప్యాయంగా పలుకరించారు. కరీంనగర్లో కార్యకర్తల సమావేశానికి వస్తున్న కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ శనిగరం స్టేజీ వద్ద 50 వాహనాలతో ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ కారు దిగగానే పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కేటీఆర్ సతీశ్ అన్న బాగున్నవా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.. అంటూ ముచ్చటించారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా నాయకులు సమావేశానికి వస్తున్నారని కేటీఆర్‌కు సతీశ్‌కుమార్ వివరించగా, ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్‌కు పరామర్శ
విద్యానగర్/ కొత్తపల్లి, మార్చి 23 : ప్రమాదంలో గాయపడి నగరంలోని రెనే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ పద్మజను బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి పరామర్శించారు. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే, కానిస్టేబుల్ పద్మజను సీపీ గౌస్ ఆలం పరామర్శించారు. ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. సీపీ వెంట రూరల్ ఏసీపీ శుభమ్ ప్రకాశ్, సీఐలు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్ కుమార్ ఉన్నారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని పరిశీలించిన కేటీఆర్
కార్పొరేషన్, మార్చి 23 : కరీంనగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకుడు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం
కొత్తపల్లి, మార్చి 23 : కరీంనగర్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సమావేశ మందిరంలో ఎన్నుకున్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా బాబు శ్రీనివాస్ (జడ్పీహెచ్ఎస్, గంగాధర), కార్యదర్శిగా ఆడెపు శ్రీనివాస్ (జడ్పీహెచ్ఎస్, తాడికల్) ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి గౌడ్ ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎన్నికల పరిశీలకుడిగా చంద్రయ్య, ఎన్నికల అధికారిగా కడారి రవి వ్యవహరించారు.
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి
గన్నేరువరం, మార్చి 23: మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణారెడ్డి ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద ఆయనకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యేలు
చిగురుమామిడి/ తిమ్మాపూర్, మార్చి 23 : కరీంనగర్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. శనిగరం వద్ద హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల సతీశ్‌కుమార్, తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ వద్ద మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలుకగా, అక్కడి నుంచి భారీ సంఖ్యలో కార్ల కాన్వాయ్‌తో కరీంనగర్ పయనమయ్యారు.
జేఏసీ దీక్షకు కేటీఆర్ సంఘీభావం
తిమ్మాపూర్, మార్చి 23: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలను ఆవిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కరీంనగర్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. దీక్షలో కొద్దిసేపు కూర్చుని జేఏసీ నాయకులతో మాట్లాడారు. మహనీయుల విగ్రహాలతో రాజకీయం చేయడం కాంగ్రెస్ నాయకులకే చెల్లిందన్నారు. ఈ అంశంపై తాను అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆర్టీసీ స్థలం అని అధికారులకు ఫిర్యాదు చేసి విగ్రహాల ఆవిష్కరణకు నోచుకోకుండా చేశారని, నేడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. విగ్రహాల ఆవిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చేయకపోతే తామే చేస్తామని హెచ్చరించారు.